ఒడిషాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది చనిపోయారు. ఒకరిద్దరు చనిపోతేనే అయ్యో అనుకుంటాం.. అలాంటిది 275 మంది అంటే మాటలు కాదు. మహా విషాదం. అన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం వేయి మందికిపైగా గాయపడ్డారు. వారి జీవితాలూ తలకిందులు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే… స్థానిక ప్రజలు ఆస్పత్రులకు పోటెత్తారు. రక్తం అవసరం అయితే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది వారిలో మిగిలి ఉన్న మానవత్వం. మరి బాధ్యత ఉన్న వాళ్లు సరిగానే స్పందింంచారా ? అన్నదే ఇక్కడ సందేహం.
ప్రమాదం జరిగిపోయింది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. బాధ్యులెవరు అన్నది తర్వాత సంగతి. ఆ ప్రమాదంలో చనిపోయిన వారు.. గాయపడిన వారు.. వారి కుటుంబాల ఆవేదనను.. కనీస మాత్రంగా తీర్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యులు ఏం చేస్తున్నారు ?. మృతదేహాల తరలింపు దృశ్యాలు సోషల్ మీడియాలో చూస్తున్న వారికి కడుపు మండిపోకుండా ఉంటుందా ? . మృతదేహాల గుట్టల్ని ఒకే వాహనంలో వేసుకుని తరలించారు. గాయపడిన వారికి మెరుగైన సౌకర్యాలు అని గొంతెత్తి ప్రచారం చేస్తారు కానీ ఆయా రాష్ట్రాల నుంచి అంబులెన్స్ లు వచ్చే వరకూ పట్టించుకోలేదు. ఇప్పటికీ కొన్ని వందల మందికి సరైన వైద్యసదుపాయం అందడం లేదు.
ఇప్పటికే ఆయా రైళ్లలో ప్రయాణించిన వారి కుటుంబసభ్యులకు స్పష్టమైన సమాచారం అందడం లేదు. ఫోటోలు పట్టుకుని వారంతా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రైల్వే శాఖకు వారి వేదను పట్టించుకునే తిరిక లేదు. సంఘటనా స్థలానికి రైల్వే మంత్రి వైష్ణవ్ వచ్చారు. ఆయన మొదట బోగీల కిందకు వెళ్లి వస్తున్నట్లుగా పీఆర్ ఫోటోలు, వీడియోలు తీయించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తానే అందర్నీ కాపాడుతున్నట్లుగా ప్రచారం చేసుకోవడానికి చేయాల్సినంతగా తిరుగుతున్నారు. ప్రధాని మోదీ కూడా పర్యటించారు. ఆయన బాగా డిప్రెస్ అయిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవన్ని జరుగుతున్నాయి కానీ బాధితులకు కనీస సాంత్వన కష్టమైపోయింది.
ప్రమాదం మహా విషాదం.. కానీ బాధ్యతతో వ్యవహరించాల్సిన వారు తీరు అంత కంటే ఘోర విషాదం. ఎవరు చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాలన్నట్లుగా… ఓట్లేసి గెలిపించుకున్న పాలకులు చేసిందాన్ని ప్రజలు భరించాల్సిందే.