మూడో సారి గెలవడమే టార్గెట్ గా కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు . నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున.. ఈ నాలుగు నెలల్లోనే నలభై వేల కోట్లు పథకాలకోసం ఖర్చు చేయనున్నారు. రైతుబంధు, దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష ఆర్థిక చేయూతతో పాటు ఇప్పటికే రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్షిప్లు, కేసీఆర్ కిట్, పల్లెలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి వంటి వాటికి కూడా నిధులు విడుదల చేయలనుకుంటోంది.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే నిధులను విడుదల చేసి, ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. నిధుల సమీకరణ వ్యూహాలు అమలు చేస్తున్న కేసీఆర్ జులై నుంచి నిధుల వరద పారించేందుకు ప్లాన్ చేసుకున్నది. సెప్టెంబర్ దాకా ప్రతి స్కీమ్‌కు ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా వానాకాలం సీజన్ రైతుబంధుకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయ నున్నారు. గతంలో డిసెంబర్ వరకూ ఈ పథకం గురించి పట్టించుకునేవారు కాదు. కానీ ఈ సారి ముందే ఇస్తున్నారు. దళితబంధు కోసం 5వేల కోట్ల మేర ఖర్చు చేయనున్నారు. గృహలక్ష్మి స్కీమ్ కింద రూ.3 వేల కోట్ల నుంచి రూ.4వేల కోట్ల దాకా ఖర్చు చేస్తారు.
నిధుల సేకరణ తెలంగాణ సర్కార్ కు గండంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు లీజు వల్ల రూ.7,300 కోట్లు .. భూముల అమ్మకంతోనూ ఈ మూడు నెలల్లో రూ.10 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. అప్పులు యావరేజ్‌గా మూడు నెలల కాలంతో తీసుకునే రాష్ట్ర అప్పు రూ.14 వేల కోట్లు ఉంటుంది. ఇతర ఆదాయాలు జీతాలు ఇతర ఖర్చులకు పోతే.. అదనంగా భూముల అమ్మకం, లీజుల ద్వారా పథకాలకు నిధులు సేకరించాలనుకుంటున్నారు.