`నాకు ఛంగీజ్ ఖాన్ పాత్ర చేయాలని ఉంది.. ఎప్పటికైనా చేస్తా` అంటూ నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ వేదికపై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన అన్నదే తడవు.. ఈ ప్రాజెక్టుకు బీజం పడిపోయింది. బాలయ్య కోసం ఓ దర్శకుడు `ఛంగీజ్ ఖాన్` స్క్రిప్టుని తయారు చేసే పనిలో పడిపోయాడు. నిర్మాత కూడా రెడీ. ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ పతాకంపై నిర్మాత కోనేరు సత్యనారాయణ తెరకెక్కించబోతున్నారని సమాచారం. బాలయ్యకు, దర్శకుడికీ ఆయన ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చేశారని టాక్. అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన వెంటనే, బోయపాటి శ్రీను సినిమా పట్టాలెక్కుతుంది. 2024 ఎన్నికలకు ముందే బోయపాటి సినిమా విడుదల అవుతుంది. ఆ తరవాత `ఛంగీజ్ ఖాన్` సినిమా ఉంటుందని టాక్. వచ్చే యేడాది సరిగ్గా ఈ సమయానికి `ఛంగీజ్ ఖాన్` ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్నది బాలయ్య ప్లాన్. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కీలకం. అందుకే సదరు దర్శకుడు కూడా యేడాది సమయం కావాలని అడిగాడట. మరో ఆరు నెలల్లో స్క్రిప్టు సిద్ధం చేసి, నటీనటులు, మిగిలిన తారాగణం ఎంపిక చేస్తారు. ఈలోగా బాలయ్య తన చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేస్తారు.