కేసీఆర్ బీజేపీ, మోదీపై అనూహ్యంగా సైలెంట్ కావడం ఎందుకో రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే ఇతర నేతలు ఇంకా విమర్శలు ప్రారంభించలేదు.. కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం కేసీఆర్ పై సెటైర్లు ప్రారంభించారు. అదీ కూడా గతంలో కేసీఆర్, కేటీఆర్ బీజేపీపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ సెటైర్లు వేశారు.
బీజేపీలో చేరిన వారందరి కేసులు మాఫీ అయిపోతాయని.. వాషింప్ పౌడర్ నిర్మా అంటూ గతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా ఫ్లెక్సీలు వేశారు. దీన్నే గుర్తు చేసిన షర్మిల.. వాషింగ్ పౌడర్ నిర్మా .. కేసీఆర్ కు సైతం పనిచేసినట్టు ఉందిని … నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది. బీజేపీతో దోస్తీ బయటపడిందిని ఎద్దేవా చేశారు. కారు – కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ మొఖంలో కనపడ్డదని.. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోడీని పల్లెత్తుమాట కూడా అనడం లేదని ప్రశ్నించారు.
బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టిండని సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా..? పోస్ట్ పోల్ ఒప్పందమా..? చెప్పాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమని.. బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రీమెంట్ అని ఆరోపిచారు. కేసీఅర్ కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందం చేసుకున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత అని షర్మిల ప్రస్నించారు. ఈ విషయంలో కేసీఆర్ ను ఇతర పార్టీలు కార్నర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ అది బీజేపీకే ఎక్కువ డ్యామేజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.