ఆదిపురుష్ కోసం చిత్ర బృందం ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. థియేటర్లోని టికెట్లన్నీ అమ్మినా.. ఒక్క సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. ఆ ఒక్క టికెట్ అమ్మరు. ఎందుకంటే అది హనుమంతుడి కోసం. రామాయణ పారాయణం ఎక్కడ జరుగుతున్నా.. అక్కడ హనుమంతుడు వస్తాడన్నది హిందువుల నమ్మకం. అలా హనుమంతుడి కోసం ఆ ఒక్క సీటూ ఖాళీగా ఉంచుతారన్న మాట. నిజంగానే ఈ ఐడియా కొత్తగా ఉంది. పబ్లిసిటీ పరంగా ఇది వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే థియేటర్ అంతా నిండినా ఒక్క సీటు ఖాళీగా ఉంటుంది. దాంతో యాదృచ్చికంగానే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుల చూపులు అటువైపు పడతాయి. అక్కడ ఓ హనుమంతుడి ప్రతిమ ఉంచితే.. ప్రేక్షకుల్లోనూ కాస్త భక్తి పారవశ్యాలు కలుగుతాయి.
అప్పుడెప్పుడో అమ్మెరు సమయంలో ఇలాంటి ట్రిక్కే ప్లే చేశారు. సినిమా జరుగుతున్నప్పుడే.. తెర దగ్గరకు వెళ్లి హారతులు పట్టేవారు. థియేటర్ బయట ఓ మినీ గుడి వెలసేది. అక్కడ పూజలు, పునస్కారాలూ, హుండీలూ, ప్రసాదాలూ వరుస కట్టేవి. థియేటర్‌కి వెళ్లామన్న ఫీలింగ్ ఎవరికీ కలగలేదు. ఓ దేవాలయానికి వెళ్లినట్టే అనిపించేది. అది అమ్మెరు వసూళ్లకు బాగా హెల్ప్ చేసింది. ముఖ్యంగా మహిళలు థియేటర్లకు క్యూ కట్టారు. అలా.. ఆ సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది. దాదాపుగా ఆదిపురుష్ది కూడా అలాంటి ఐడియానే. మరి ఇదెంత వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.