‘యాత్ర’ సినిమాతో తనని తాను నిరూపించుకొన్నాడు మహి.వి.రాఘవ. నిజానికి ఆ సినిమాపై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. ఎందుకంటే అదో పొలిటికల్ ఎజెండాతో తీసిన సినిమా. పొలిటికల్ స్పీచుల్లానే ఉంటుందని, ఓ పార్టీకి కొమ్ము కాస్తుందని అనుకొన్నారు. కానీ ఆ ముద్ర ఏం లేకుండా, చాలా నీట్‌గా ప్రజెంట్ చేశాడు మహి. వైకాపా సినిమానే అయినా.. ఆ వాసన పెద్దగా తగలకుండా, మిగిలిన జనాలకూ నచ్చేలా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ‘యాత్ర 2’ తీస్తున్నాడు. ఈ సినిమాపై తప్పకుండా ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకొంటారు. ఎందుకంటే అది మహి సినిమా కాబట్టి.
యాత్ర 2 పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఈలోగా ‘సైతాన్’ అనే ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ బయటకు వచ్చింది. మహి వి.రాఘవ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు. ట్రైలర్ చూస్తే.. ‘ఇది తీసింది యాత్ర దర్శకుడేనా’ అనిపించేలా ఉంది. ట్రైలర్ మొత్తం బూతులు. హింస, రక్తపాతం. కత్తితో నరుక్కోవడం, తల తెగి పడడం.. ఇవే కనిపించాయి. ఇంత హింస ఈ మధ్యన ఏ వెబ్ సిరీస్‌లోనూ చూడలేదు. ట్రైలర్లోనే ఇంత ఉంటే, ఇక వెబ్ సిరీస్‌లో ఇంకెంత ఉందో? ఈ ట్రైలర్ చూసిన వాళ్లెవరైనా సరే, కాస్త భయకంపితులు అవుతారు. ఆ స్థాయిలో కట్ చేశారు. ఓటీటీ కంటెంట్ కీ సెన్సార్ ఉండాల్సిందే అనుకొనే వాళ్లు `సైతాన్` మరో ఆయుధాన్ని ఇచ్చినట్టైంది. ఈ ట్రైలర్‌తో ఇకపై ఇలాంటి చర్చ మరింత జోరుగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ వెబ్ సిరీస్ జయాపజయాలు పక్కన పెడితే – ‘యాత్ర 2’ కి ముందు మహి నుంచి ఇలాంటి కంటెంట్ రావడం మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘యాత్ర 2’ తమ పార్టీ పొలిటికల్ మైలేజీ కోసం వాడుకోవాలని వైకాపా శ్రేణులు అనుకొంటాయి. వాళ్లకు సైతం.. ‘షైతాన్’ షాక్ కి గురి చేస్తుంది.