తెలుగుదేశం పార్టీ వస్తే పథకాలు ఆపేస్తారన్న వైసీపీ ప్రచారానికి టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో తెరపడింది. అదే సమయంలో చంద్రబాబు ఇవ్వలేరనే విషయం కూడా వాదించలేకపోతున్నారు. జగన్ ఇవ్వగా లేనిది సంపద సృష్టి చేసే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నిస్తున్నారు. ఈ లాజిక్ కూడా తేలిపోవడంతో మేనిఫెస్టో కాపీ అంటూ కొత్త విమర్శలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తమ పథకాల లబ్దిదారులకు ముందుగానే ఎంపిక చేసి వారికి కార్డులు పంచబోతోంది.
వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అర్హులు అనేపేరు చెబుతూ… అందర్నీఎలిమినేట్ చేసేశారు. నియోజకవర్గానికి వెయ్యి మంది కూడా ఉండని లబ్దిదారులతో పథకాలు లాగేస్తున్నారు.. చివరికి విదేశీ విద్యా దీవెన పథకానికి… బడుగు, బలహీనవర్గాల పెళ్లిళ్లకు ఇచ్చే సాయానికి కూడా ఊహించని షరతులు పెట్టి… లబ్దిదారుల్ని తగ్గించేశారు. అందుకే టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. అర్హుల పేరుతో ఎవర్నీ ఎలిమినేట్ చేయబోమని… నమ్మకం కలిగించేందుకు ముందుగానే కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ కార్డులు అందుకున్న వారందరికూ తమకు ప్రభుత్వ పథకాలు వస్తాయన్న నమ్మకం ఉంటుందని ఇది ఓట్ల పంటపండిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
అసలు నగదు బదిలీ అనే కాన్సెప్ట్ టీడీపీదే. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఈ హామీలను ఇచ్చింది. నారా లోకేష్ ఈ మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో యాక్టివ్ కాకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. టీడీపీ అధికారంలోకి వస్తే.. నగదు బదిలీ చేస్తామని కుప్పంలో ఇలా లబ్దిదాుల కార్డుల్ని కూడా పంచారు. కానీ ఆ నగదు బదిలీ హామీలకు టైమింగ్ మిస్సయింది. ఈ సారి మాత్రం టీడీపీ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది. మెజార్టీ ఓటర్లకు.. లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేసి నమ్మకం కలిగించబోతున్నారు.