ఇండియాను అమెరికాను చేస్తామంటే… ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇండియా పేరును అమెరికా అని మార్చేసి.. చెప్పినట్లుగా చేశానంటే… ఆ పాలకుడ్ని ఎలా చూడాలి. ఇక్కడ పాలకుడు తెలివైనవాడా.. వెర్రి వాడా ? ప్రజలు వెర్రివాళ్లా ?అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఏపీ ప్రభుత్వం సీపీఎస్ విషయంలో చేస్తున్న ప్రచారం కూడా అందే. సీపీఎస్ రద్దు అంటూ ప్రచారం చేసేస్తున్నారు . మళ్లీ జీపీఎస్ తెచ్చామంటున్నారు.
ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంది. ఆ వెంటనే సీపీఎస్ రద్దు అంటూ ప్రకటనలు ప్రారంభించారు. కూలీ మీడియా.. సోషల్ మీడియా సౌజన్యంతో సీపీఎస్ రద్దు చేసేశామని గప్పాలు కొట్టుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వం, వైసీపీ తీరు చూసి సీపీఎస్ ఉద్యోగులు… పెనం మీద నుంచి పొయ్యిలో వేసి.. రద్దు చేశామని చెప్పుకుంటారా అని ఖండ్రించినంత పని చేస్తున్నారు.
సీపీఎస్ రద్దు చేయడం అంటే.. ఉద్యోగుల జీతం నుంచి మినహాయిస్తున్న పది శాతాన్ని మినహాయించడం ఆపాలి. ఆ తర్వాతే ప్రయోజనాలు కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగుల జీతం నుంచి సీపీఎస్ పేరుతో మినహాయించుకుంటున్న మొత్తాన్ని .. ఇక ఉద్యోగుల ఖాతాలకే బదిలీ చేస్తామని చెప్పడం లేదు. ఇప్పటి వరకూ కత్తిరించిన పది శాతాన్ని ఇస్తామని చెప్పడం లేదు. కానీ.. సీపీఎస్ రద్దు చేసేశాం అని చెబుతున్నారు. గతంలో పది శాతం మొత్తాన్ని ఇప్పుడు జీపీఎస్ పేరుతో పధ్నాలుగు శాతం చేస్తారన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉన్నాయి. పాత పెన్షన్ పథకం ప్రకారం.. ఉద్యోగుల జీతంలో రూపాయి కూడా తీసుకోరు. అలా కాకుండా ఉద్యోగుల జీతంలో పది శాతం తీసుకుని ఏది అమలు చేసినా.. పేరు ఏది పెట్టినా అది సీపీఎస్సేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తప్పుడు ప్రచారాలు… ఫేక్ పాలనతో నాలుగేళ్లుగా ప్రభుత్వం ప్రజలందర్నీ మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడు సీపీఎస్ రద్దు చేసేశామన్న హమీ నెరవేర్చామని చెప్పుకునేందుకు ఈ వేషాలు ప్రారభించింది. నమ్మిన వాళ్లే గొర్రెలన్నమాట.