ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి – డబుల్ ప్రాఫిట్ పొందడం ఎలానో బాహుబలితో చూపించాడు రాజమౌళి. ఆ తరవాత పుష్ప కూడా అదే బాటలో నడిచింది. చాలా సినిమాలు ఇప్పుడు ఈ ఫార్ములా అనుసరిస్తున్నాయి. రాజమౌళి మరోసారి పార్ట్ 1, పార్ట్ 2 పంథాలోనే సినిమా తీస్తున్నట్టు టాక్.
రాజమౌళి తదుపరి సినిమా మహేష్‌తోనే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమానీ రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్. దీనిపై మహేష్‌తో రాజమౌళి వాడీ వేడీగా చర్చలు జరుపుతున్నాడట. రెండు భాగాలుగా తీసేంత స్టఫ్ ఈ కథలో ఉందని, అలాంటప్పుడు దాన్ని వదులుకోకూడదన్నది రాజమౌళి ఆలోచన. ఇలా రెండు భాగాలుగా తీయాలనుకొంటే.. మరికొంత అదనపు సమయం ఈ సినిమాకి కేటాయించాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్ల కాల్షీట్లు ఇచ్చేయాలి. ఇప్పుడు పార్ట్ 2 కూడా అంటే – మరో యేడాది పోయినట్టే. బాహుబలి విషయంలో ఇదే జరిగింది. అయినా సరే, దానికి తగిన ప్రతిఫలం వచ్చింది. రాజమౌళి ఒకటి ఫిక్సయ్యాడంటే.. అది జరిగి తీరుతుంది. మహేష్ కూడా రాజమౌళి ఆలోచనల సరళికి అనుగుణంగా వర్క్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా, రాదా? అనేది రాజమౌళి తీసుకొనే ఫైనల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.