మంత్రి పదవి పోయిన తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. సొంత బాబాయే తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనకు టిక్కెట్ లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తన నీడన రాజకీయాలు చేయాల్సన బాబాయ్ రూప్ కుమార్ తన టిక్కెట్ కే ఎసరు పెడుతున్నట్లుగా కనిపించడంతో అనిల్ కుమార్ రగిలిపోతున్నారు. సీఎం జగన్ ఇద్దరూ కలిసి పని చేయాలని సూచించారు. అయితే అదే అడ్వాంటేజ్ అన్నట్లుగా రూప్ కుమార్ చెలరేగిపోతున్నారు. తాజాగా సొంత ఆఫీసు పెట్టుకుని దానికి జగన్ పేరు పెట్టేసారు.
ఎమ్మెల్యే అనిల్ ఆఫీస్ పేరు రాజన్న భవన్ అయితే, రెండో పవర్ సెంటర్ పేరు జగనన్న భవన్. అనిల్ వ్యతిరేక వర్గమంతా ఇక్కడకు చేరుకుంది. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి జగనన్న భవన్ రూప్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి అనిల్ వ్యతిరేక వర్గం హాజరైంది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సహా ఇతర నాయకులు రూప్ కుమార్ వెంట నడిచారు. అనిల్ కుమార్ అనుచరుల్లో సగం మందికిపైగా రూప్ కుమార్ వెంటనే వెల్లారు. నెల్లూరు సిటీలో అనిల్ కి టికెట్ దక్కనీయకుండా రూప్ కుమార్ పావులు కదుపుతున్నారు.
రూప్ కుమార్ కి సిటీలో మంచి పట్టు ఉంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆయన నేరుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించకపోయినా.. అనిల్ కి రాకుండా చేస్తే సగం విజయం సాధించినట్టే అనుకుంటున్నారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పార్టీపట్ల విధేయత ప్రదర్శిస్తూనే అనిల్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. రూప్ కుమార్ కు అండగా సీఎం జగన్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ ను పక్కన పెట్టేయడానికి రూప్ కుమార్ ని ప్రొత్సహిస్తున్నారని చెబుతున్నారు.