వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వెంటనే బెయిల్ కూడా ఇచ్చేశారట. ఈ ట్విస్ట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం ఆయన హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. అప్పుడే అరెస్ట్ చేశారు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ నిబంధనల్లో ఒక వేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఐదులక్షల రూపాయల పూచికత్తుతో విడుదల చేయాలన్న షరతు ఉంది. ఆ ప్రకారం ఐదు లక్షల పూచికత్తు తీసుకుని విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఈ పూచీకత్తు ఇవ్వాల్సింది కోర్టుకే.. మరి సీబీఐకి ఎలా ఇచ్చారనే డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వివేకా కేసులో అన్నీ విచిత్రాలే జరుగుతున్నాయి మరి.
ఈ విషయం తెలియదేమో కానీ సునీత ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సునీత దాఖలు చేసుకున్న పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉంది. గురువారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్‌ను శుక్రవారం మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.
అవినాశ్‌కు గత నెల 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటీషన్లో సునీత పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో సునీత పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా సునీత తెలిపారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్లో వెల్లడించారు. సునీత పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో సీబీఐ సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ముందస్తు బెయిల్ ను కాకుండా.. బెయిల్ రద్దుపైనే వాదనలు జరగాల్సి ఉంది.