పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రివర్స్ టెండరింగ్ లో దక్కించుకున్న మెఘా పంస్థ ఆ ప్రాజెక్టును తన చేతకాని నిర్మాణంతో రిస్క్ లో పడేసింది. చేసిందే అతి కొదది పనులు. ..అవి కూడా నాసిరకంగా చేసినట్లుగా తేలింది. రూ. 81 కోట్లు పెట్టి నిర్మించి గైడ్ బండ్ అనే నిర్మాణం కుంగిపోయింది. ఇది కాఫర్ డ్యామ్ లాగా.. ప్రాజెక్ట్ నిర్మాణం వరకూ మాత్రమే వినియోగంలో ఉండేది కాదు. ప్రాజెక్ట్ ఉన్నంత కాలం స్థిరంగా ఉండాలి. కానీ మేఘా కంపెనీ నిర్మాణం చేసిన ఏడాదికే కుంగిపోయింది. దీంతో గగ్గోలుప్రారంభమయింది.
కాళేశ్వరంనూ ముంచేసిన మేఘా
మేఘా కంపెనీ మామూలు కాంట్రాక్ట్ సంస్థ. భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన దాఖలాలు లేవు. ఆ రంగంలో అనుభవం కూడా లేదు. కానీ ప్రభుత్వ పెద్దల అండతో… తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు దక్కించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్… పోలవరంలాంటిది కాదు. అక్కడక్కడా చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టడం.. పంప్ హౌస్ లను నిర్మించడం కీలకం. అక్కడ కూడా భారీ వైఫల్యమే ఎదురయింది. కాళేశ్వరం పంప్ హౌస్ గోదావరి వరదలకు మునిగిపోయింది. వీలైనంత వరకూ బయటకు రాకుండా మీడియాను వెళ్లకుండా కట్టడి చేసి మరమ్మతులు చేశారు. ఇప్పటికీ నీటిని ఎత్తిపోయలేకపోతున్నారు.
పోలవరంలోనూ బయటపడిన నిర్వాకం
పోలవరం ప్రాజెక్ట్ అత్యంత క్లిష్టమైనది. నిర్మాణ సంస్థను మధ్యలో మార్చడం అంటే.. పోలవరం భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని కేంద్ర పెద్దలుకూడా హెచ్చరించారు. కానీ సీఎం జగన్ … మాట వినలేదు. మేఘా కృష్ణారెడ్డికి రివర్స్ టెండరింగ్ లో కట్టబెట్టారు. ఇప్పుడు అతి కష్టం మీద నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోయింది. అక్కడకు మీడియాను వెళ్లకుండా చేసి బయటపడిపోదామనుకుంటున్నారు. కానీ మేఘాను ఈ పాపం వెంటాడబోతోంది.
మేఘా నిర్మాణాలన్నీ నాణ్యతా లోపంలో ఉంటాయా ?
తెలుగు రాష్ట్రాల పెద్దలకు మేఘా కృష్ణారెడ్డి ఎంత ప్రియమైన వ్యక్తో చెప్పాల్సిన పని లేదు. ఎవరి వాటాలువారికి ఇవ్వడంలో ఆయన ఆరితేరిపోయారని రాజకీయవర్గాలు విమర్శిస్తూ ఉంటాయి. అందుకే… పోలవరం గైడ్ బండ్ కుంగిపోయినా… కాళేశ్వరం నీట మునిగినా ఆయనను ప్రభుత్వాలు వెనకేసుకు వస్తున్నాయి కానీ.. నిర్మాణ లోపం అనడం లేదు. ప్రభుత్వాలు మారితేనే… ఈ మేఘా గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది.