ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ తర్వాత అన్నవరం బయలుదేరి వెళ్తారు. వారాహి యాత్ర కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను ప్రకటించారు. వారు ఏర్పాట్లలో తనమునకయ్యారు. జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే… జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. ఫలానాతేదీన పవన్ వస్తున్నారంటే.. ఫ్యాన్స్ వెల్లువలా వస్తారు. అందుకే గోదావరి జిల్లాల్లో యాత్ర హోరెత్తిపోతుదంని గట్టిగా నమ్ముతున్నారు.
మరో వైపు నాగబాబు ప్రధాన కార్యదర్శి హోదాలో అందర్నీ మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానని ఆయన ప్రకటన విడుదల చేశారు. రాజకీయం అనే పదాన్ని అడ్డు పెట్టుకొని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడదీస్తూ.. ఒక్కో పార్టీ, ఒక్కో నాయకుడు వారికి ఇష్టమొచ్చిన రీతిలో వాడేసుకుంటున్నారని.. ఆ పరిస్థితిని పవన్ కల్యాణ్ మారుస్తారన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని నాగబాబు అంటున్నారు.
పవన్ కల్యాణ్ నిరంతరాయంగా యాత్ర చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు. రూట్ మ్యాప్ ప్రస్తుతానికి తూ.గో జిల్లాకే ఖరారు చేసినా.. అది అయ్యే సరి మరో జిల్లా ఇలా.. అన్ని జిల్లాలను కవర్ చేయాలనుుంటున్నారు. ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వస్తున్నారనే విమర్శలు రాకుండా.. ముందస్తు లేదని చెప్పి మళ్లీ రిలాక్స్ అయ్యారనే అభిప్రాయాలు వినిపించకుండా పవన్ ఎక్కువ కాలం ప్రజల్లోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.