వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన సాక్ష్యాలు ఆధారంగా కేసులో మెరిట్ ఉన్నందున వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లుగా సీబీఐ కోర్టు ప్రకటించింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావిత వ్యక్తి అని బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐతో పాటు సునీత చేసిన వాదలను సీబీఐ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు.
అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో.. భాస్కర్ రెడ్డి కూడా ఆరోగ్య కారణాలు చూపి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని.. వివేకా హత్యతో తన ప్రమేయం లేదని.. సాక్ష్యాలు లేవని వాదించారు. అయితే సీబీఐ మాత్రం వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని.. దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది. వైఎస్ భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లే అని పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే అని.. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టమని తెలిపింది.
భాస్కర్ రెడ్డి బెయిల్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్లో సీఎం జగన్ ప్రస్తావన కూడా సీబీఐ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టి వేయడంతో భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.