దండిగా అప్పు తీసుకున్నారు. ఇష్టారీతిన ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు తీరా అప్పు కట్టమంటే.. తాము కట్టలేమని.. అప్పు కట్టమని వేధిస్తు్న్నారని కోర్టుకెళ్లింది బైజూస్. ఆ సంస్థ చైర్మన్ రవీంద్రన్ విన్యాసాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులో భాగంగా.. ఓ వాయిదాగా 40 మిలియన్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఈ గడువు జూన్ 5 తేదీతో ముగిసింది. చివరి క్షణం వరకూ కడతామని చెబుతూ వచ్చిన బైజూస్ యాజమాన్యం చివరికి చేతులెత్తేసింది. 1.2 బిలియన్ డాలర్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేక బైజూస్ చేతులెత్తేస్తోంది.
అమెరికా సంస్థల నుంచి తీసుకున్న రుణం కావడంతో ఆ సంస్థలు వేధిస్తున్నాయని బైజూస్ అమెరికాలోని రెండు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టులో ఈ కేసు తేలే వరకూ అసలూ వడ్డీ, చెల్లించబోమని బైజూస్ చెబుతోంది. అయితే ఈఎంఐ కట్టకుండా కోర్టుకు వెళ్లినందున బైజూస్‌కు ఇక ఎక్కడా రుణాలు లభించే అవకాశం కనిపించడం లేదు. దీంతో కంపెనీ భవిష్యత్ ప్రమాదంలో పడుతోంది. ఇంకా చెప్పాలంటే.. బైజూస్ కోర్టులో ఓడిపోతే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. జరిమానా కూడా భారీగా కట్టే అవకాశం ఉంటుంది.
బైజూస్ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ సంస్థ అకౌంట్లు కూడా గందరగోళంగా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అకౌంట్స్ రెగ్యులేటరీ సంస్థల వద్ద సకాలంలో ఫైల్ చేయడం లేదు. మరో వైపు బైజూస్ ను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిపిస్తోంది. బైజూస్ కంటెంట్ కొంటామని పదే పదే చెబుతున్నారు. నిజానికి.. బైజూస్ సేవలను 90శాతం మంది వదలుకున్నారు. అందుకే ఆ సంస్థ ఆదాయం దారుణంగా పడిపోయింది.