అచ్చంగా కేసీఆర్ మాట్లాడిన మాటలే ఇవి. కాకపోతే ఈసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటినుంచి వెలువడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సమయంలోగానీ ఇంకా వేర్వేరుగా ఇతర సందర్భాల్లోగానీ పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మాటలు వాడారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా సేం టూ సేం డైలాగు వేస్తున్నారు.. కాకపోతే, అది కేసీఆర్ గురించి మాత్రం కాదు. ఏపీ సర్కారు మీద విమర్శలతో విరుచుకుపడుతున్న మందకృష్ణ మాదిగ గురించి!
మందకృష్ణ కూడా.. ఎస్సీల్లో వర్గీకరణ అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో మాత్రమే పోరాడుతూ ఉండే వ్యక్తి. ఆయన చాలా పోరాటాలకు సారథ్యం వహించారు గానీ.. ఇతర పార్టీలు సహకరించినా కూడా.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఒకప్పట్లో చంద్రబాబుతో సాన్నిహిత్యం నెరపిన మందకృష్ణ, ఇటీవలి కాలంలో జగన్‌తో క్లోజ్‌గా ఉన్నారు. చంద్రబాబు మీద ఎడాపెడా విమర్శలతో దూసుకుపోతున్నారు. ఆనేపథ్యంలో తాజాగా కూడా చంద్రబాబు మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.
వాటి గురించి చంద్రబాబునాయుడు బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కూడా చర్చ వచ్చినట్లు సమాచారం. మందకృష్ణ వైఖరి గురించి ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ‘తెలంగాణకు చెందిన మందకృష్ణకు ఆంధ్రప్రదేశ్‌లో అసలేం పని ‘ అంటూ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చూడబోతే చంద్రబాబులో కూడా అసహనం పెరిగిపోయి అచ్చంగా కేసీఆర్ మాటలనే ఇక్కడ రిపీట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
‘చంద్రబాబునాయుడుకు ఒక రాష్ట్రం ఉంది. అక్కడ ఆయన ముఖ్యమంత్రి. అక్కడ ఆయనకు బోలెడు సమస్యలు ఉన్నాయి.వాటిని తీర్చుకోకుండా, వాటిని పట్టించుకోకుండా ఆయనకు ఇక్కడేం పని ముందు అక్కడికెళ్లి నీ సంగతి చూసుకోవయ్యా చంద్రబాబూ..’ అని కేసీఆర్ గతంలో పదేపదే అనేవారు. చంద్రబాబు మాత్రం తాను తెలుగుజాతి మొత్తానికి నాయకుడిని అని, తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉంటానని వారి కోసం పనిచేస్తానని చెప్పేవారు. అయితే అదే సూత్రాన్ని ఆయన మందకృష్ణ విషయంలో ఆక్సెప్ట్ చేయలేకపోవడం గమనార్హం.