జగన్ అక్రమాస్తుల కేసులను సత్వరం విచారించాలంటూ తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అన్నది కోర్టు తేలుస్తుంది. కానీ అసలు జగన్ కేసుల విచారణ నిజంగా ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ గతంలో ప్రతి శుక్రవారం జరిగేది. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యేవారు.
అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ కారణాలు, అధికారిక బాధ్యతల కారణంగా విచారణకు హాజరు కావడం లేదు. మధ్యలో కోవిడ్ కారణంగా కోర్టు విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత శుక్రవారం కూడా విచారణ జరగడం లేదు. ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్రమైన నేరాల అభియోగాలను కూడా ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. వేగం పుంజుకోవాల్సిన కేసుల విచారమ పూర్తిగా ఆగిపోయింది. దీనికి కారణమేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారంతా.. బడా వ్యాపారులే. వారంతా రకరకాల పిటిషన్లు వేసి… కేసుల విచారణను జాప్తం చేస్తున్నారని సీబీఐ తరచూ కోర్టులో వాపోతోంది. అంతకు మించి చేయగలుగుతుంది కూడా ేమీ లేదు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ చేపట్టింది. వైెస్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసిది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో రిపోర్టులో 58 కంపెనీలు, 13 మంది వ్యక్తుల పేర్లను నమోదు చేసి 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పట్నుంచి కేసు సా… గుతూనే ఉంది.