షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం డీకే శివకుమార్ తో పదే పదే భేటీ అవుతున్నారు. కానీ ఆమె చేస్తే గీస్తే ఏపీలో రాజకీయాలు చేసుకోవాలి కానీ తెలంగాణలో కాదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికి అని, అలాంటిది షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా అని రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తున్నారు.
పొరుగు రాష్ట్రానికి చెందిన షర్మిల, ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే తాను స్వాగతిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే, సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెను కలుస్తానని స్పష్టం చేశారు. తాను ఇక్కడ ఉన్నని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే అవుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు
పార్టీ విలీనం తర్వాత టీపీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు ఇస్తారని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల ఇమేజ్ కాంగ్రెస్‌కు కలిసివస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. డీకే శివకుమార్ ద్వారా వైఎస్ షర్మిల ఈ ప్రయత్నాల చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆమెకు.. కావాలంటే ఏపీ లో పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు కానీ.. తెలంగాణలో ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరని రేవంత్ నేరుగా నే చెబుతున్నారు. మరి షర్మిల ఏం చేయబోతున్నారో ?