పుట్టిన రోజు నాడే తనను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన ఘటనలో నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెట్టాలనుకుంటున్న రఘురామ పూర్తి స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయప్రక్రియ ఆలస్యమయ్యే చాన్స్ లు ఉండటంతో సాక్ష్యాలు తారుమారు కాకుండా చూసుకుంటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తనకు చేసిన మెడికల్ రిపోర్టులను భద్రపరచాలని ఆయన వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది.
విచారణలో 2021 మే 15, 16 తేదీల్లో రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు రిపోర్ట్ ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ కౌంటర్పై హైకోర్టు, పిటీషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడీయాలజీ నివేదికలు ఉన్నాయా లేవా అని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికలు ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు.
నివేదికలు భధ్ర పరచాలని, ఎట్టిపరిస్థితుల్లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం మరోసారి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారినికి వాయిదా వేసింది. గతంలోనే ఆయన తన కస్టోడియల్ టార్చర్పై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయితే రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటా ను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐ కు ఏపీ హైకోర్టు ఆదేశించింది.