‘స్టాలిన్’లో చిరంజీవి, త్రిష కలిసి నటించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడీని తెరపై చూడబోతున్నాం. అవును.. చిరు – త్రిష మరోసారి జోడీ కట్టబోతున్నారు.
చిరంజీవి కోసం దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఓ కథని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చిరు కుమార్తె సుస్మిత ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో చిరుకి జోడీగా త్రిష ఎంపిక దాదాపుగా ఖాయమైంది. సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిరు, సిద్దూ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. సిద్దూకి జోడీగా శ్రీలీల పేరు పరిశీలిస్తున్నారు. తను కూడా దాదాపుగా ఖాయమే. `భోళా శంకర్` తరవాత… వశిష్ట (బింబిసార ఫేమ్)తో ఓ సినిమా చేస్తున్నాడు చిరు. దాంతో పాటు కళ్యాణ్ కృష్ణ సినిమానీ సమాంతరంగా పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.