వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహిస్తున్న తెదేపాను అడ్డుకోవడానికి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వంపై ఒకేసారి రెండు వైపుల నుంచి ఎదురుదాడికి దిగినట్లుంది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల రాజధాని ప్రాంతంలో భూబాగోతాల గురించి ఒకవైపు సాక్షిలో వరుస కధనాలు ప్రచురిస్తూనే మరోవైపు కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని మళ్ళీ ప్రభుత్వంపై ఉసిగొల్పినట్లున్నారు.
సాక్షిలో వస్తున్న కధనాలతో ఇప్పటికే అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవేళ ముద్రగడ కూడా మళ్ళీ మార్చి 10వ తేదీ నుండి నిరాహార దీక్షకు కూర్చోన్నట్లయితే ఇంకా చిక్కుల్లో పడుతుంది. ఇదివరకు ఆయన దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేసేందుకు ప్రభుత్వం ఆయనతో కొన్ని ఒప్పందాలు చేసుకొని ఉంది కనుక మళ్ళీ ఇప్పుడు ఆయనతో కొత్తగా మాట్లాడేందుకు ఏమీ ఉండబోదనే చెప్పాలి. కనుక ఈసారి ఆయన దీక్షకు దిగితే దాని ముగింపు మరోలా ఉండవచ్చును. తెదేపా ప్రభుత్వాన్ని ఏదోవిధంగా నిలువరించాలనే జగన్ ప్రయత్నాలలో భాగంగానే జగన్ ప్రోద్భలంతోనే ముద్రగడ మళ్ళీ దీక్షకు కూర్చొంటున్నట్లయితే ఈసారి వైకాపా బహిరంగంగానే ఆయన దీక్షకు మద్దతు ప్రకటించవచ్చును. దాని వలన ఈసారి ఆయన దీక్ష వలన ప్రభుత్వంపై గతంలో కంటే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది.
అయితే తెదేపాను ఎలాగయినా నిలువరించాలనే ప్రయత్నంలో జగన్ ముద్రగడకు బహిరంగంగా మద్దతు పలికినట్లయితే అది వైకాపాకు ఆత్మహత్యతో సమానం అవుతుంది. కాపులను బీసీలలో చేర్చడాన్ని బీసి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసి కూడా ముద్రగడని వెనుక నుండి జగన్ ప్రోత్సహిస్తే వైకాపాపై బీసిలు ఆగ్రహం చెంది దానికి దూరం కావచ్చును. ఈవిధంగా జగన్ ఒక సమస్య పరిష్కరించుకోవడానికి మరొక సమస్యను సృష్టించుకోవడంతో దాని వలన పార్టీ ఎమ్మెల్యేలకి కూడా అగ్నిపరీక్షగా మారుతోంది. ఇదంతా స్వయంకృతాపరాధమే అయినప్పటికీ ఏదో ఒకసారి అంటే ఎవరయినా ఇటువంటి సమస్యలను ఎదుర్కోగలరు కానీ నిత్యం అగ్నిపరీక్షలు ఎదుర్కోవాలంటే ఎవరూ ఇష్టపడకపోవచ్చును. కనుక తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రదర్శిస్తున్న ఈ తీరు, అనుసరిస్తున్న చిత్రవిచిత్రమయిన ఈ వ్యూహాల కారణంగా తమ రాజకీయ భవిష్యత్ కి నష్టం కలుగుతుందని వైకాపా ఎమ్మెల్యేలు భావించినట్లయితే ఆ కారణంగానే మరికొంత మంది తెదేపాలోకి క్యూ కట్టినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లవుటుంది అప్పుడు.