తెలంగాణ బీఆర్ఎస్ కీలక నేతలపై మరోసారి ఇన్ కంట్యాక్స్ అధికారులు గురి పెట్టారు. వరుసగా ముగ్గురు కీలక నేతల ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేయడం ప్రారంభించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, , నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు చెందిన నగదు వ్యవహారాలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. వీరు ముగ్గురూ బీఆర్ఎస్ లో సౌండ్ పార్టీలుగా పేరొందారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మనీని తమ వ్యాపార సంస్థల ద్వారా సర్క్యూలేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
మర్రి జనార్ధన్ రెడ్డికి.. వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వాటిలో జ్యూయలరీ విభాగం కూడా ఉంది. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం నియోజకవర్గం గజ్వేల్ ను చూసుకుంటున్నారు. సీఎం తరపున ఆయనే అన్ని చక్క బెడుతూ ఉంటారు. పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు కొన్ని సూట్ కేసు కంపెనీలను పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. వీరిపై ఐటీదాడులు .. బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో ఐటీ దాడుల సంఖ్య తగ్గిపోయింది. బీజేపీపై కేసీఆర్ కూడా విమర్శలు చేయడం లేదు. అయితే అనూహ్యంగా.. ఈ ఐటీ దాడులు జరగడం వారిలో ఆందోళన పెంచుతోంది.
బీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలు సైలెంట్ గా ఉండటంతో ఆరెండు పార్టీల మధ్య అవగాహన ఉందన్న ప్రచారం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఐటీ అధికారులు దాడులు చేయడంతో వారు మళ్లీ తమ మధ్య ఏం లేదని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. అమిత్ షా పర్యటనకు ఒక్క రోజు ముందుగా ఈ దాడులు జరగడం కూడా చర్చనీయాంశం అవుతోంది.