పథకాల పేరుతో చేస్తున్న మోసంపై ప్రజల్లో కనిపిస్తున్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు జగన్ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అర్హుల పేర్లతో పథకాలను అతి కొద్దిమందికే ఇచ్చేవారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఏవో కొర్రీలు పెట్టేవారు. మెజార్టీ ప్రజలు ఇలాంటి వారే కావడంతో.. ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. పథకాలు మంజూరైన వారికీ నగదు జమ కాకపోవడం మరో సమస్య. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవాలని జగన్ భావిస్తున్నారు.
జగనన్నకు చెబుదాం అంటూ ప్రారంభించిన కాల్ సెంటర్ లో పథకాలు అందడం లేదని.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న కాల్సే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో జగన్ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. వెంటనే స్పందనపై సమీక్షా చేసి.. సురక్షా అనే కార్యక్రమం ప్రకటించారు. ఈనెల 23 నుంచి జులై 2౩ వరకూ జగనన్న సురక్షా పేరుతో ఇంటింటికి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై వివరాలు తెలుసుకుని సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి మరీ దరఖాస్తు చేయిస్తారు. ఇలా అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారట.
మరి ఇప్పటి వరకూ వారికి ఎగ్గొట్టిన పథకాల డబ్బులు ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఇంత కాలం పథకాలు ఎగ్గొట్టి ఓట్లకు వెళ్లే ముందు వారికి పథకాలు మంజూరు చేసి.. వారి ఓట్లు కొట్టేసే ప్రయత్నమే ఈ సురక్షా అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ఓ జడత్వం కనిపించింది. ఇంటికి వెళ్లమని ప్రతీ నెలా ప్రభుత్వం చెబుతూండటంతో వారు కూడా నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడే వారికి అనేక మంది పథకాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చాయని ఇచ్చిన లెటర్లలో ఉన్నవన్నీ తప్పులేనన్నారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. ఇప్పుడు చురుకు తగిలే సరికి జగనన్న సురక్షా అనే కార్యక్రమం పెట్టి జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.