జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడమే మొదటి టార్గెట్ గా పెట్టుకున్నారు. వారాహి యాత్ర ప్రారంభమైన సందర్భంగా తొలి సభను కత్తిపూడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన .. కీలకమైన ప్రకటనలు చేశారు. తాను అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టనో చూద్దామ వాలు విసిరారు. తనను ఓడించడానికి గత ఎన్నికల్లో చేయాల్సినవి అన్నీ చేశారని.. ఈ సారి ఎన్ని చేసినా సరే అసెంబ్లీ అడుగు పెట్టి తీరుతానన్నారు. కచ్చితంగా జనసేన పాదముద్ర అసెంబ్లీలో పడుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే కక్ష కట్టి, తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దనే ఉద్దేశంతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు.
తన నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఉంటే, మొత్తం లక్షా 8 వేల ఓట్లు పోలయ్యాయని అన్నారు. జనసేన కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందని, మొత్తం రాజకీయం ఇక్కడి నుంచే చేస్తామని తేల్చి చెప్పారు. తాను విడిగా వస్తానో, వేరే పార్టీతో కలిసి వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి తాను ఎన్ని వ్యూహాలైనా అమలు చేస్తానని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. ఉచ్ఛం నీచం లేకుండా ముఖ్యమంత్రితో సహా నన్ను తిడుతున్నారని… దేశంలోనే అత్యధిక పారితోషికాలు తీసుకొనే నటుల్లో తానూ ఒకడినని గుర్తు చేశారు. అలాంటప్పుడు నేను ఆ మాటలు ఎందుకు పడాలని ప్రశ్నించారు.
ప్రజల కోసం ఏమీ చేయకపోతే తప్పు అవుతుందని, నా మనసు తట్టుకోలేక నేను మీకోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎంత నీచంగా మాట్లాడినా నేను భరిస్తాను. ధైర్యం అనే గుణాన్ని ప్రజల గుండెల్లో నింపడానికే వచ్చానన్నారు. జనసేనాని జనంలోకి రావడంతో .. జనసైనికులు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కత్తిపూడికి తరలి వచ్చారు. అన్నవరం నుంచి ర్యాలీ నిర్వహిద్దామనుకున్నా ఎండల కారణంగా పవన్ ర్యాలీని రద్దు చేసుకున్నారు. కత్తిపూడి సభలో ప్రసంగించారు.