మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమైందని మరోసారి మీడియాకు లీకులు ఇచ్చారు. జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని ఈ సారి తేదీ ఖరారు చేశారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సత్తుపల్లి నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ నెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారని కాంగ్రెస్ వర్గాలుచెబుతున్నాయి.
భేటీ అనంతరం తెలంగాణలో వేరువేరు బహిరంగ సభల్లో పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం సభలో పొంగులేటి అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని చెబుతున్నారు. అయితే వీరంతా కాంగ్రె్స లో చేరుతారని చాలా కాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కానీ వారి నోటి వెంట మాత్రం తాము కాంగ్రెస్ లో చేరుతామన్న మాట మాత్రం రావడం లేదు.
పార్టీలో చేరాలంటే వారు చాలా డిమాండ్లు పెట్టారన్న చర్చ కొంత కాలంగా జరుగుతూనే ఉంది. ఆ డిమాండ్లకు ఓకే చెప్పారో లేదో కానీ.. నేతలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నారు. పొంగులేటి రాజకీయ భవిష్యత్ ఏపీ సీఎం జగన్ చేతుల్లో ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ కు దూరం అయ్యాక. .. ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి ఏపీలో పెద్దఎత్తున కాంట్రాక్టులు ఇస్తున్నారు. జగన్ చెప్పే పార్టీలోనే పొంగులేటి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.