జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అంచనాలకు తగ్గట్లుగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పధ్నాలుగో తేదీన ప్రారంభించి.. విరామం లేకుండా కాకినాడ వరకూ వచ్చారు. ప్రతి నియోజకవర్గానికి రెండు రోజులు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం పూట అన్ని వర్గాలతో సమావేశం అవుతున్నారు. సాయంత్రం బహిరంగసభ పెడుతున్నారు. దీంతో .. పవన్.. వీలైనంత వరకూ ఎక్కువ మందిని కలిసే అవకాశం ఏర్పడుతోంది.
ప్రసంగాల్లో పవన్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. దూకుడుగా ఉంటున్నారు. కానీ ఆయన ఓటమి గురించి ఎక్కువ మాట్లాడుతూండటం మాత్రం ఎబ్బెట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. తనను ఓడించడానికి రెండు వందలకోట్లు అయినా ఖర్చు చేస్తారని పవన్ ప్రకటించారు. ఇది ఓ రకంగా ఆయనలోని ఆందోళనను బయటపెడుతోందని వైసీపీ నేతలు విమర్శించే అవకాశం ఉంది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇంకా స్పష్టత లేదు. నిజానికి ఇలా ఓ వ్యక్తిని ఓడించడానికి వందల కోట్లు వెదజల్లితే ప్రజలు.. ఆ వ్యక్తినే గెలిపిస్తారు. నాడు లక్ష్మి పార్వతి దగ్గర నుంచి నేడు ఈటలరాజేందర్ వరకూ జరిగింది అదే. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం.
పవన్ కల్యాణ్ వైసీపీ అక్రమాలు, లా అండ్ ఆర్డర్ పై ధాటిగా విమర్శలు చేస్తున్నారు. అంతా అద్భుతంగా ఉన్నప్పటికీ చివరికి తనను చంపడానికి కూడా సుపారీ ఇచ్చారని చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. క్రూర మనస్థత్వం ఉన్న పాలకులు దేనికైనా తెగబడతారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని పవన్ ప్రజల ముందు పెడుతున్నారు కానీ.. చివరికి వచ్చే సరికి తన భద్రత గురంచీ చెప్పుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే పార్టీ నేతల ద్వారా ప్రత్యేక ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తే.. సంచలనం అవుతుంది.
పవన్ ప్రసంగాల్లో కంటిన్యూటీ గురించి చెప్పాల్సిన పని లేదు. అందులో ఇంప్రూవ్ మెంట్ లేదు. ఒక రోజు ప్రసంగానికి మరో రోజు ప్రసంగానికి చాలా తేడా ఉంటుంది. అయితే పవన్ బ్రాండ్ అదేనని.. అందరూ సర్దుకుపోవడం కామన్ అయిపోయింది.