ఆయన పేరు నాగిరెడ్డి. కరుడు గట్టిన నేరస్తుడు. ఏపీలోనూ కేసులు నమోదయ్యాయి. కానీ అరెస్ట్ కారని ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. ఆ నేరస్తుడు కర్ణాటకలో కూడా నేరాలు చేశాడు. అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దార్వాడ జైల్లో వేశారు. కడప జిల్లా పోలీసులు ఆ నాగిరెడ్డిని … తమ జిల్లాలోనూకేసులు ఉన్నాయని చెప్పి పీటీ వారెంట్ మీద కోర్టులో హాజరు పర్చడానికి ధార్వాడ నుంచి కడప జిల్లాకు తీసుకు వచ్చారు. కోర్టులో హాజరు పరిచారు. కానీ ఆ నాగిరెడ్డిని మళ్లీ ధార్వాడ జైల్లో అప్పగించలేదు. ఎందుకంటే..ఆయన పారిపోయాడని సమాధానం ఇచ్చారు కడప జిల్లా పోలీసులు.
పాపం ధార్వాడ జైలు అధికారులు… ఇదేదో తేడాగా ఉందే అనుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కరుడుగట్టిన నేరస్తుడైన నాగిరెడ్డిని .. కోర్టులో హాజరు పరిచి తీసుకొస్తామని తీసుకెళ్లి పారిపోయాడని చెబితే పరువు తక్కువ కాదా.. అందుకే కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. ఇలా చాలా తీవ్రమైన విషయమని.. అందుకే ఏడుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఎస్పీ అన్బురాజన్.. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడంటే… ఏళ్లు గడుస్తున్నా ఆయనను మార్చే ఆలోచన కూడా చేయడం లేదు.
తప్పించుకుపోయిన నాగిరెడ్డిని పట్టుకోవడం పెద్ద కష్టమా .. అంటే.. పోలీసులు అంత వట్టిపోలేదన్న అభిప్రాయం ఎవరి దగ్గరైనా వస్తుంది. కానీ ఏపీ పోలీసులు వట్టిపోయారని నిరూపిస్తూ ఉంటారు. నాగిరెడ్డిని పట్టుకోలేదు..పట్టుకునేందుకు ప్రయత్నిస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు నాగిరెడ్డి ఏపీలో హ్యాపీగా ఎక్కడైనా తిరిగవచ్చు. కర్ణాటక జైల్లో ఉండే నాగిరెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే ఏపీకి తీసుకు వచ్చి.. పారిపోయాడనే కథ చెబుతున్నారని ఎవరైనా అనిపిస్తే వాళ్ల తప్పేమీ ఉండదు. ఎందుకంటే.. ఏపీలో పోలీసులపై నమ్మకం ఆ స్థాయిలో ఉంది మరి !