కేంద్ర ప్రభుత్వం లోటు భర్తీ కింద రూ. పది వేల కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇష్టారీతిన అప్పులు చేస్తూనే పోతోంది. ఆ డబ్బులన్నీ ఏమైపోయాయనే సందేహం చాలా మందికి ఉంది. అయితే.. అవన్నీ కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో పోయాయన్న విషయం మెల్లగా బయటకు వస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన కాంట్రాక్ట్ కంపెనీలకు వేల కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ కంపెనీలు ఏం పనులు చేశాయన్న దానిపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు.
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ఇన్ ఫ్రాకు రూ. ఆరు వందల కోట్లు చెల్లించారు. తెలంగాణకు చెంది న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు రూ. మూడు వందల కోట్లు చెల్లించారు. రాజంపేట ఎమ్మెల్యేకు చెందిన ఎంఆర్కేఆర్ కన్ స్ట్రక్షన్స్ కు రూ. రెండువందల యాభై కోట్లు చెల్లించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ కన్ స్ట్రక్షన్స్ కు రూ 185 కోట్లు చెల్లించారు. ఫణికుమార్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ. యాభై కోట్లు చెల్లించారు. వీరంతా ప్రభుత్వానికి దగ్గరే.
పనులు చేసి .. బిల్లులు చెల్లింపు చేస్తే ఎవరూ తప్పు పట్టరు రాష్ట్రంలో అసలు అభివృద్ధి పనులే జరగడం లేదు. ఈ కంపెనీలన్నీ ఏ పనులు చేశాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పొంగులే్టి శ్రీనివాసరెడ్డికి అన్నమయ్య డ్యాం కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ పనులు ప్రారంభించలేదు. అయినా వందలకోట్లు ఎలా చెల్లించారన్నది కీలకం. మిగిలిన వారికీ అలాగే కాంట్రాక్టులు కేటాయించి నిధులు మంజూరు చేసి ఉంటారని భావిస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ వివరాలను కాకినాడలో ప్రకటించారు. ఎన్నికల కోసం ఇలా ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల దగ్గర దాస్తున్నారని అంటున్నారు.
అసలు రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్ ఎవరంటే.. మేఘా కృష్ణారెడ్డి. ఆయనకు ఎన్ని వేల కోట్లు నగదు బదిలీ జరిగిందో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.