విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా తన కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కిడ్నాప్ విషయంలో అసలు జరిగింది ఒకటి అయితే.. బయటకు చెబుతోంది మరొకటని.. మొత్తం బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాల్సిందేనని ఇతర రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ.. తాను కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నానని ప్రకటించారు. ఎర్రగంగిరెడ్డితో లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నారని.. వెయ్యి కోట్ల లావాదేవీలు జరిగాయంటున్నారని.. తన ఆస్తి మొత్తం అంత ఉండదన్నారు.
ఈ కిడ్నాప్ వెనుక ఏదో ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయని.. గడిచిన అయిదు సంవత్సరాల కాలంలో నా ఫోన్ కాల్స్ రికార్డు తీస్తే.. ఆ రౌడీషీటర్లతో తనకు సంబంధాలు ఉన్నాయో లేదో తెలుస్తందన్నారు. అయితే ప్రభుత్వాన్ని మాత్రం వెనకేసుకు వచ్చారు. అన్ని ప్రభుత్వాల హయాంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నారు. కేవలం మీడియా కారణంగానే తన వ్యాపారాలను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసుకుంటున్నానని ప్రకటించారు. అదీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనేనని సమర్థించుకున్నారు.
పవన్ కల్యాణ్ చక్కగా మాట్లాడారు.తప్పు చేసిన వారిని ఎన్ కౌంటర్ చేసేయాలని అన్నారని.. మిగతా అందరూ మాట్లాడింది కరెక్ట్ కాదన్నారు. కిడ్నాప్ అయిన బాధితులు చనిపోవాలని అనుకుంటున్నారా అని కిడ్నాప్ పై మరో కోణం ఉందని అంటున్న వారిని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీ విష్ణు కుమార్ రాజు నా పై ప్రెస్ మీట్ పెట్టి కిడ్నాప్ లో కుట్ర కోణం దాగివుంది.. ఎంపీ చెప్పింది సినిమా కధ లా ఉందన్నారని.. తనకు కూడా సినిమా ట్విస్ట్ లానే అనిపించిందని చెప్పుకొచ్చారు.
మొత్తం వివరాలు చెప్పకుండా ఎంపీ ఏదో దాస్తున్నారని పోలీసులు కూడా అసలు నిజాలు చెప్పడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీన్ని కవర్ చేసుకునేందుకు ఎంవీవీ ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఆయన మాటతీరులోనే అసలు విషయం తేలిపోయిందన్న వాదన వినిపిస్తోంది.