తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి కుటుంబం కేసీఆర్కు ఎట్టకేలకు గుర్తు వచ్చింది. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడయ్యారని చెబుతున్నారు. ఆమెకు కేసీఆర్ కబురు పంపించారు. గవర్నర్ కోటాలో శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేయాలని డిసైడయినట్లుగా చెబుతున్నారు. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. సాధారణంగా అవి ఖాళీ అయ్యే నాటికి భర్తీ చేస్తారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా భర్తీ చేయలేదు. గవర్నర్ కు ఎలాంటి సిఫార్సులు పంపలేదు.
గతంలో హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన హైకమాండ్ సైదిరెడ్డికి చాన్స్ ఇచ్చింది. ఆయన విజయం సాదించారు. అప్పటి నుంచి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరులకు కేటాయించారు. గురువారం అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఈ సభలోనే అమరవీరుడు అయిన శ్రీకాంతాచారి తల్లికి పదవిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
అమరులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాంగా ఆరోపణలు వస్తున్నాయి . వీటిని తిప్పికొట్టేందుకు శ్రీకాంతాచారి తల్లికి పదవి ఇస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు బీఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు.. ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం చూస్తున్నారు. ఒక సీటు అనూహ్యంగా శంకరమ్మకు కటాయించడంతో కేసీఆర్ రాజకీయంగా ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నరు.