ఓటీటీలు విస్తరించిన తరవాత ‘సినిమా’ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మార్కెట్ పరంగా వెసులుబాటు వచ్చింది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో నిర్మాతలకు నికరమైన మొత్తం సినిమా విడుదలకు ముందే నిర్మాత చేతికి అందుతోంది. దాంతో కొంత వరకూ సేఫ్ అవ్వగలుగుతున్నారు. ఈమధ్య కాలంలో కొన్ని సినిమాల్ని ఓటీటీలే కాపాడాయి అన్నది కఠోన నిజం. అయితే ఈ ఓటీటీ వల్ల నిర్మాతలకంటే, హీరోలకే ఎక్కువ లాభం జరుగుతోంది.
సినిమా బడ్జెట్‌లో కనీసం 30 శాతం ఓటీటీల రూపంలో వెనక్కి వస్తోంది. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో… ఓటీటీ లాభసాటిగా కనిపిస్తోంది. దాన్ని హీరోలు కూడా క్యాష్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఓ అగ్ర నిర్మాత… ఓ మాస్ హీరో దగ్గరకు కథ పట్టుకెళ్తే… ‘నాన్ థియేటరికల్ రైట్స్ మొత్తం నాకిస్తే సినిమా చేస్తా’ అంటున్నాడట. అదే తన పారితోషికంగా భావించాలి. అంటే నిర్మాతకు రాబడి కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలోనే వస్తాయన్నమాట. ఓరకంగా.. ఈ బిజినెస్ సింపుల్ ట్రిక్‌గానే కనిపిస్తోంది. హీరోలకు పారితోషికం బదులుగా, ఓటీటీ రైట్స్ ఇస్తే బెటరే కదా అనిపిస్తుంది. కానీ.. నిర్మాతలకు ఇక్కడే పెద్ద రిస్క్ ఉంది. థియేటర్ల నుంచి వస్తున్న వసూళ్లు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. సినిమా బాగుంటే ఫర్వాలేదు. కాస్త అటూ, ఇటూగా ఉంటే ఓటీటీలో చూద్దాంలే అని ప్రేక్షకులు లైట్ తీసుకొంటున్నారు. టూ టైర్, త్రీ టైర్ హీరోలకు ఎక్కువగా ఈ సమస్య ఉంది. చిన్న సినిమాలైతే సరే సరి. మరీ బాగుంటే తప్ప.. ఎవ్వరూ అటు వైపుకు వెళ్లడం లేదు.
నికరంగా వచ్చే నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం హీరోలకు ఇచ్చేస్తే.. ఇక నిర్మాతలకు మిగిలేదేముంది? ఒకవేళ ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు రాకపోతే, వచ్చినా సినిమా ఫ్లాప్ అయి నష్టాలొస్తే అప్పటి పరిస్థితేంటి? ఇవన్నీ… ఆలోచించుకోవాల్సిన విషయాలే. మినిమం రేంజున్న హీరోలే కాదు, ఒకట్రెండు హిట్స్ ఉన్న కుర్ర కథానాయకులు కూడా ‘ఓటీటీ రైట్స్ రాసి ఇచ్చేయండి చాలు’ అంటున్నార్ట. సినిమా విడుదలకు ముందే ఓటీటీ సంస్థల నుంచి డీల్ తెచ్చుకొని, ఆ పెట్టుబడితో సినిమాలు తీద్దామన్న నిర్మాతలకు ఇవన్నీ ఇబ్బంది కరంగా కనిపించే విషయాలు. హీరోల మాయలో పడి, వాళ్లు డేట్స్ ఇస్తే చాలు.. అనుకొంటున్న నిర్మాతలు వెంటనే ఈ డీల్ కి ఒప్పుకొంటున్నారు. కాస్త లోకజ్ఞానం ఉండి, పరిస్థితినీ, మార్కెట్ నీ అంచనా వేయగలిగే అనుభవం ఉన్న వాళ్లయితే – చల్లగా జారుకొంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపిస్తున్న పరిస్థితి ఇదీ.