వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. షర్మిల కూడా రెడీ అయిపోయారని చెబుతున్నారు. వైఎస్ జయంతి రోజున రాహుల్, సోనియా ఇడుపుల పాయ వస్తారని అంటున్నారు. అదే జరిగితే… ఖచ్చితంగా ఏపీ రాజకీయాలపై వారు గురి పెట్టినట్లే అనుకోవచ్చు. తెలంగాణలో షర్మిల రాజకీయం అనే మాటే అతకదు. కానీ ఆమె జగన్ తో చేసుకున్న ఒప్పందమో మరో కారణమో కానీ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు.
వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కానీ… కనీస స్పందన లేదు. వచ్చే ఎన్నికల్లో రెండు, మూడు శాతం ఓట్లు కూడా గ్యారంటీ లేదు. పాలేరులో ఆమె గెలుస్తారని కూడా ఎవరూ అనుకోవడం లేదు. అసలు చాన్స్ లేని చోట షర్మిల చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అయితే వేగంగా అంచనా వేస్తున్న షర్మిల.. కాంగ్రెస్ లో విలీనానికి ప్రయత్నించారు. గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. కానీ ఆమె తెలంగాణలో స్థానం కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఆమెను ఏపీలోనే లీడర్ ను చేయాలనుకుంటోంది.
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీదే. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు. ఆ ఇమేజ్ ద్వారా జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు అదే వైఎస్ కుటుంబం నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. షర్మిల రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా.. కాంగ్రెస్ పార్టీ నేతగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తే.. వారంతా ఆదరించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ అంతా మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. షర్మిల అసలైన వారసురాలిగా ఏపీలో నిలబడతారన్న అంచనాలు ఉన్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికల తర్వాత జరుగుతాయి. తెలంగాణ లో వచ్చిన ఫలితాలు ఏపీ రాజకీయాలనూ ప్రభావితం చేస్తాయి. అందులో సందేహం లేదు. షర్మిల కూడా ఆ రాజకీయాల్లో ఏపీలో తేలే అవకాశం ఉంది.