తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ప్రాణార్పణం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ అంటూ చేసిన ప్రచారం ఉత్తదేనని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు అమరవీరులకు గుర్తు చేసుకునేందుకు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లుగా మీడియాకు లీక్ చేసి.. హడావుడి చేశారు. ఆమె ఎలాంటి ఆందోళనలు చేయకుండా… వేదిక మీద ఎమ్మెల్సీ ప్రకటిస్తారన్నట్లుగా సంకేతం ఇచ్చారు. చివరికి వేదిక మీద శాలువా కప్పారు కానీ ఎమ్మెల్సీ గురించి ప్రకటించలేదు.
అమరవీరుల కుటుంబాల కోసం ఏం చేస్తారన్నదానిపైనా స్పష్టత లేదు. దీంతో ఎన్నో రోజుల నుంచి రాజకీయ పదవి కోసం ఎదురు చూస్తున్న శంకరమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఇవ్వాలని అడుగుతున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అమరవీరులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన కేసీఆర్ శ్రీకాంతాచారి తల్లికి హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించారు. ఆమె ఓడిపోయారు. ఉపఎన్నికల్లో సైదిరెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. చివరికి ఏ పదవి లేకుండా పోయింది.
ఇటీవల ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాలు జరిగినప్పుడు ఆమెకు ఏదో ఓ పదవి ఇస్తారని మీడియాకు లీకులు ఇస్తూంటారు. చివరికి నిరాశే ఎదురవుతూ ఉంటుంది. శ్రీకాంతాచారి తండ్రి కేఏ పాల్ పార్టీలో చేరినప్పుడు కూడా బీఆర్ఎస్ తరపున ఈమె .. కేఏ పాల్ ఆరోపణలు చేసింది. చివరికి ప్రతీ సారి ఆశాభంగమే ఎదురవుతోంది.