నెల్లూరులో మరో మాజీ మంత్రి వాయిస్ పెంచుతున్నారు. నేను ఇలాగే ఉంటే చంపేస్తారని ఇక నుంచి తానేంటో చూపిస్తానని ఆయన ప్రకటించారు. దాదాపుగా ఇరవై రోజుల పాటు నెల్లూరులో లేకుండాపోయిన ఆయన… సీఎం జగన్ తో ఎమ్మెల్యేల సమీక్షకు వెళ్లిన తర్వాత తిరిగి వచ్చారు. జగన్ టిక్కెట్లు ఇవ్వబోనని హెచ్చరికలు జారీ చేసిన పద్దెనిమిది మందిలో అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నసమయంలో ఆయన నెల్లూరులో అనుచరులతో సమవేశం పెట్టారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తాను సైలెంట్ గా ఉంటే.. ఏలిక పాము కూడా తాచుపాముగా మారి బుసలు కొడుతోందని మండిపడ్డారు. ఇక నుంచి చూసుకుందామని సవాల్ చేశారు.
అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ జగనన్నకార్యాలయం పెట్టుకుని వైసీపీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయన అనుచరులు అత్యధిక మందిరూప్ కుమార్ వెంట వెళ్లిపోయారు. అనిల్ కు చెక్ పెట్టడానికి.. హైకమాండ్ .. రూప్ కుమార్ ను ప్రోత్సహిస్తోందని క్లారిటీ రావడంతో .. అనిల్ ను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో హైకమాండ్ ను ఏమీ అనలేక.. జిల్లాలో రాజకీయాలు చేయలేక ఆయన సతమతమవుతున్నారు. జగన్ పై ఎంతో అభిమానం చూపిన తనను అలా రోడ్డున పడేయరని అనుకుంటూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల సమీక్ష తర్వాత మొత్తం తేలిపోవడంతో ఆయన అనుచరులతో సమావేశం పెట్టినట్లుగా భావిస్తున్నారు.
వైసీపీలో అతి ఎక్కువ చేసే నేతల్లో అనిల్ కుమార్ ఒకరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీలో ఎంత లేకిగా ప్రవర్తించేవారో అందరూ చూశారు. తర్వాత మంత్రి నారాయణపై స్వల్ప మెజార్టీతో గెలవడంతో జగన్ మంత్రిని చేశారు. కానీ మూడేళ్లలో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ పదవి పోయిన తర్వాత ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నారా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అనిల్ ఈ సారి గెలవడని చాలా కాలంగా ప్రజల్లో మౌత్ టాక్ స్ప్రెడ్ కావడం.. నారాయణ పోటీ చేయడం ఖాయమని తేలడంతో .. ఎవరూ అనిల్ వైపు ఉండటం లేదు.