వర్మ – వ్యూహం టీజర్ అస్సలేమాత్రం హడావుడి లేకుండా బయటకు వచ్చేసింది. జగన్ మైలేజీ కోసం… వర్మ తీస్తున్న సినిమా ఇది. వర్మ చాలా ఫాస్ట్. చక చక సినిమా లాగించేస్తుంటాడు. అలానే వ్యూహం కూడా పూర్తి చేసేశాడు. అందుకే టీజర్ ఇప్పుడు బయటకు తీసుకొచ్చాడు. హెలీకాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ తరవాత.. ప్రతిపక్షాలు పన్నే వ్యూహాలు, జగన్పై సీబీఐ ఎంక్వైరీ, అరెస్ట్… ఇలా టీజర్ సాగుతూ వెళ్లింది. ఇందులో వర్మ కొత్తగా చెప్పిన విషయాలేం లేవు. సంఘటల్ని గ్లోరిఫై చేయడం తప్ప. వర్మ పాత పద్ధతిలోనే జూనియర్ ఆర్టిస్టుల్లాంటి ఫేసుల్ని తెరపైకి తీసుకొచ్చి, సినిమాని చుట్టేసే ప్రయత్నం చేశాడని అర్థమవుతోంది.
ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నాడు వర్మ. రాజశేఖర్ రెడ్డి హయాంలో జనసేన లేదు. ఓట్లు చీల్చిందల్లా ప్రజారాజ్యమే. అయితే చిరంజీవి ప్రస్తావన టీజర్లో ఎక్కడా లేదు. బహుశా.. సినిమాలో చూపిస్తారేమో..? ఈమధ్య చిరు జగన్ మధ్య స్నేహం బాగానే నడుస్తోంది. అందుకే.. చిరుకి వ్యతిరేకంగా ఎలాంటి సన్నివేశాలూ ఉండకపోవొచ్చు. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు. అక్కడ పవన్ ప్రస్తావన పుష్కలంగా ఉంటుంది. టీజర్ అయితే.. ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు. ఎందుకంటే వర్మ గత సినిమాల మాదిరిగానే మేకింగూ, టేకింగూ ఉన్నాయి. కొత్త విషయాలూ ఏం చెప్పలేకపోయాడు.