తెలంగాణ కాంగ్రెస్లో విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతున్న వేళ.. సైలెంట్ అయిన కొంత మంది సీనియర్లు పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిలో ముందున్న పేరు .. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పై కోవర్టు అనే ముద్ర చాలా కాలంగా ఉంది. గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికీ…కేసీఆర్ సీఎం అయ్యేందుకు ఆయన సహకరించారని చెబుతారు.
రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక… తన రాజకీయ వారసుడు కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి పంపారు. అప్పటి నుండి ఆయన కూడా బీఆర్ఎస్ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల అది మరీ ఎక్కువ అయింది. కొద్ది రోజుల క్రితం ఆయనకు పోలీసులు కూడా సహకరించి కాంగ్రెస్ లో తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించగానే .. కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను పోలీసులు పట్టుకున్నారు. ఇది కూడా సంచలనం అయింది.
తాజాగా ఆయన తో పాటు ఆయన భార్య కూడా పార్టీ మారబోతున్నారని ఒకరికి లోక్ సభ మరొకరికి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ప్రారంభమయింది. దీన్ని ఉత్తమ్ రెడ్డి ఖండించారు. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్నారు. కానీ కాంగ్రెస్ లో ఇప్పుడే ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. కోమటిరెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని నిరూపించుకున్నారు కానీ.. ఉత్తమ్ రెడ్డిపై మాత్రం ఇంకా అలాగే అనుమాన మేఘాలున్నాయి.