ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా మారిపోయారు. ఈ వారం కూడా ఆయన పూర్తిగా తెలంగాణ రాజకీయాలకే తన ” కొత్త పలుకు” ను పరిమితం చేశారు. గత వారం పూర్తి స్థాయిలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆయన ఈ వారం కాంగ్రెస్ పార్టీ గెలువాలంటే ఏం చేయాలో కొన్ని ఉచిత సలహాలు.. పరోక్షంగా ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్పడానికి ప్రయత్నించారు.
కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని.. రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే చాన్స్ ఉంది కానీ ఆయన అందర్నీ కలుపుకుని పోవాలని సలహాలిస్తున్నారు. జగ్గారెడ్డి,, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డిలను కలుపుకోవాలని.. ఒంటెద్దు పోకడలు వద్దని సూక్తులు చెప్పారు. తాను టిక్కెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలు కూడా డీకే శివకుమార్ సీఎంగా వద్దన్నారని కర్ణాటక రాజకీయాలను కూడా కలిపారు. రేవంత్ రెడ్డికి ఇలా సహాలు ఇవ్వడమే కాదు.. బీఆర్ఎస్ బలాల్ని కొన్ని ఎకరవు పెట్టారు. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉందన్నట్లుగా సంకేతాలు పెట్టారు.
బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న వర్గాల్లో ముస్లింలు ఒకరు . ఎంఐఎంతో సాన్నిహిత్యం కారణంగా ముస్లిం వర్గాలన్నీ ఇంత కాలం బీఆర్ఎస్ కు అండగా ఉంటున్నాయి కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారని ఆర్కే విశ్లేషించారు. ఇప్పుడు వారికి మరింత మద్దతు కల్పించడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. అంతే కాదు కమ్మ సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని కూడా రేవంత్ కు సలహా ఇచ్చారు. పాతిక నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం గెలుపు ఓటముల్ని నిర్దేశిస్తుందని… ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు కేసీఆర్ అన్ని చర్యలు చేపట్టా రు కానీ ఇప్పటి వరకూ కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ఆర్కే.. తెలివి మీరిన స్ట్రాటజిస్ట్ లా కాంగ్రెస్ ముందు ఓ ప్రతిపాదన పెట్టారు.
ఇందులో బీజేపీ కి కూడా సలహాలున్నాయి. పెరిగిన పార్టీని అడ్డంగా నరికేసుకున్నట్లుగా చేసుకున్నారు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు… కేసులతో కేసీఆర్ ను బిగిస్తేనే.. మీ మీద ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పాత సలహా కొత్తగా ఇచ్చారు. ఇటీవల అమిత్ షా తెలంగాణ పర్యనటకు వస్తే… ఆర్కేతో భేటీ అయ్యేవారు.కానీ రద్దయింది. ఒక వేళ భేటీ అయి ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటి సలహాలు వచ్చి ఉండేవి కావేమో ! . ఎలా చూసినా కేసీఆర్ విషయంలో ఆర్కే వంద శాతం వ్యతిరేకతతో ఉన్నారు. ఆయనను ఓడించే పార్టీ కాంగ్రెస్ అని అనిపిస్తే…. పూర్తి స్థాయిలో ఆ పార్టీకి మద్దతు తెలిపినా ఆశ్చర్యం లేదన్న పరిస్థితి ఆయన రాతల్లో కనిపిస్తోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.