తెలంగాణ రాజకీయాల్లో శనివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలను హైకమాండ్ అర్జంట్ గా ఢిల్లీకి పిలిపించింది. అదే సమయంలో కేటీఆర్ .. రాష్ట్రానికి రావాల్సిన నిధుల వేటలో భాగంగా ఢిల్లీలో ఉన్నారు. కేటీఆర్ కు రాత్రి పది గంటల తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ మీటింంగ్ పై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా కేటీఆర్ అపాయింట్ మెంట్ ను రద్దు చేస్తున్నట్లుగా అమిత్ షా ఆఫీస్ ప్రకటించింది.
అమిత్ షా తీరిక లేని కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని అందుకే.. అపాయింట్ మెంట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు కానీ అదే సమయంలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ ఆఫీసులో జరిగిన సమావేశానికి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు అమిత్ షా కూడా హాజరయ్యారు. నిజానికి వీరు జేపీ నడ్డాతో భేటీ అయినప్పటికీ… అమిత్ షా కూడా .. తెలంగాణ బీజేపీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పడానికి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కేటీఆర్ తో అపాయింట్ మెంట్ రద్దు చేసి.. తాము రాజీపడబోమని సంకేతాలు ఇచ్చారు.
అయితే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం.. ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏ నిర్ణయం అన్నది వారు చెప్పలేదు కానీ.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు… ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి కేసుల్లో సైలెంట్ కావడం.. ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్లిందని.. వాటి వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతోందని… అదే సమయంలో బీఆర్ఎస్ తో సన్నిహితం అవుతున్నారన్న ప్రచారం జరుగుతోందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా.. బీజేపీ తీసుకునే నిర్ణయాలను బట్టి… తెలంగాణలో ఆ పార్టీ పోరాటం ఉంటుదా లేదా అన్నది క్లారిటీ వస్తుందంటున్నారు.