ఆంధ్రప్రదేశ్ లో ఇక ప్రజలఆస్తులపై హక్కుల బాధ్యతలు మార్చేసే అధికారం అంటే రిజిస్ట్రేషన్లు చేసే అధికారం.. కొత్తగా పంచాయతీ సెక్రటరీల చేతికి అప్పగించింది. ఇప్పటి వరకూ వారికి ఉన్న అరకొర అధికారాలతోే ప్రజల్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టారో భరించిన వారందరికీ తెలుసు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కూడాచేసే అధికారం ఇచ్చారంటే .. ఇక చెప్పాల్సిన పని లేదు. అత్యవసరంగా 2,200 గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్ల డేటాకు కూడా వారికి యాక్సెస్ ఇచ్చేశారు.
115 ఏళ్ల కిందటి నాటి చట్టం అమలు
ఏ చట్టం ప్రకారం ఇలా ప్రజల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారం పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చారంటే… 115 ఏళ్ల కిందటి నాటి చట్టం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 1908 చట్టం సెక్షన్ (6) ప్రకారం పంచాయతీ సెక్రటరీలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇస్తున్నామని ప్రకటించింది. ఒక సబ్రిజిస్ర్టార్కి రిజిస్ర్టేషన్ కార్యాలయంలో అందుబాటులో ఉండే డేటాకు, పంచాయతీ సెక్రటరీకి కూడా యాక్సెస్ ఇచ్చింది ప్రభుత్వం.
ప్రజలకు తెలీకుండా ఆస్తుల హక్కులు మారిపోయే ప్రమాదం !
పంచాయతీ సెక్రటరీల పనులు వేరే. అసలు వారు చేసేది ఫీల్డ్ పని. రిజిస్ట్రేషన్ అనేది చిన్న పని కాదు. ప్రజల ఆస్తులతో ముడిపడిన అంశం. సబ్ రిజిస్ట్రార్లకు స్టాంపు చట్టం, రిజిస్ర్టేషన్ల చట్టం, రిజిస్ర్టేషన్ల ప్రక్రియ, వాల్యూయేషన్, ఇతర ప్రక్రియలపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఇందు కోసం సబ్ రిజిస్ట్రార్లకు కఠిన శిక్షణ ఇస్తారు. చాలా పరీక్షలు పెట్టి.. పాసయిన వారికే రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇస్తారు. కానీ పంచాయతీ సెక్రటరీలకు ఆరు నెలల శిక్షణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కానీ అది ప్రమాణాల మేరకు లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వారు చేసే తప్పులే కాదు.. అక్రమాలకు పాల్పడితే ప్రజల వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
పంచాయతీ కార్యదర్శి రిజిస్ట్రేషన్లు ఎలా చేయగలరు ?
ఒక్క డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలంటే ఎంత తతంగం ఉంటుందో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే హడావుడి చూస్తే అర్థమవుతుంది. మొత్తం పదిహేను నుంచి ఇరవై మంది సిబ్బంది వరకూ ఉంటారు. వేలిముద్రలు, ఫొటోలు, డేటా ఫీడింగ్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఎక్నాలడ్జ్మెంట్ అప్డేట్, చెక్ స్లిప్, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, దస్తావేజు, సెటిల్మెంట్ దస్తావేజు, దాన, విక్రయ, తనఖా రిజిస్ర్టేషన్లు, భాగపరిష్కార రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్లు, వివాహ రిజిస్ర్టేషన్లు, తదితర పనులన్నీ పంచాయతీ కార్యదర్శి చేయగలరా ? అనే సందేహాలున్నాయి. అందుకే ఓటు ఉందో లేదో చూసుకుకున్నట్లుగా ఇక ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం పడిందన్న వాదన వినిపిస్తోంది.