కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలనుకుంటున్న షర్మిలకు ఆ పార్టీ హైకమాండ్ నిర్మోహమాటంగా ఒకటే షరతు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో రాజకీయం చేయాలనకుంటే మాత్రమే పార్టీని విలీనం చేయాలని.. తెలంగాణలో అయితే అసెంబ్లీ టిక్కెట్ కూడా ఆశలు పెట్టుకోవద్దని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో షర్మిలకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని హైకమాండ్ కు సిఫార్సు చేస్తున్నా.. ఇతర తెలంగాణ నేతలు మాత్రం.. అసలు వద్దే వద్దని అంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా అసలు షర్మిలకు తెలంగాణతో ఏం సంబంధం అని.. ఆమె కు ఏపీ రాజకీయాలే కరెక్ట్ అన్న అభిప్రాయానికి వస్తున్నారు.
అసలు ఒక్క శాతం చాన్స్ లేకపోయినా షర్మిల తెలంగాణలోనే ఉంటానని పట్టుబడుతున్నారు. తెలంగాణలోనే..తెలంగాణతోనే అంటూ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. ఈ అంశంపై తేల్చుకోవడానికి షర్మిల రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారని చెబుతున్నారు. ఈ అంశంపైనే ప్రస్తుతం ప్రతిష్ఠంభన ఏర్పడిందని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై అభ్యంతరాలు లేకపోయినప్పటికీ.. షర్మిలకు తెలంగాణలో సీటు కేటాయించడంపై తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అక్కడ ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. షర్మిలకు పాలేరులో సీటు కేటాయించి.. పార్టీని విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయి. వైఎస్ జగన్ వల్ల తమ పార్టీకి ఏపీలో తీవ్ర నష్టం ఏర్పడింది కాబట్టి.. వైఎస్ షర్మిలతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని అనుకుంటున్నారు.. తెలంగాణలో ఆమె రాజకీయాలు చేయాల్సి వస్తే విలీనం అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా వెళ్లాలంటున్నారు. రేవంత్‌తో పాటు ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు.
షర్మిల ఏపీలో రాజకీయం చేయడానికి అంగీకరిస్తే వెంటనే విలీనం చేయడానికి హైకమాండ్ వెంటనే అంగీకరించే చాన్స్ ఉంది. కానీ ఏపీలో మాత్రం తన సేవలు ఉపయోగించుకోడానికి లేదని.. కేవలం తెలంగాణకు మాత్రమే అంటే.. హైకమాండ్ ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు.