కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికల గురించి వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు బీఆర్ఎస్లో చేరుతారన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి. టీ పీసీసీ చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి నేరుగానే హైకమాండ్ పై కూడా విమర్శలు చేశారు. తర్వాత అందరూ సర్దుకున్నారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి , జానారెడ్డి ఫ్యామిలీని బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఉత్తమ్ రెడ్డిపై ఇప్పటికే కోవర్ట్ అనే ముద్ర ఉంది. ఆయన రాజకీయ వారసుడు కౌశిక్ రెడ్డిని ఎప్పుడో బీఆర్ఎస్లో చేర్చారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఉత్తమ్ కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎంపీ టిక్కెట్.. ఆయన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆఫర్ చేశారని చెబుతున్నారు. జగ్గారెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన కు గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ లేకపోతే ఈ పాటికి బీఆర్ఎస్లో చేరేవారని అంటున్నారు. జానారెడ్డి తన రాజకీయ వారసుడి కోసం.. బీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నరాని చెబుతున్నారు.
నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతం మాత్రమే కాకుండా కాంగ్రెస్ బలహీనం చేయడానికి బీఆర్ఎస్ అధినేత సీనియర్లపై దృష్టి పెట్టారన్న ప్రచారమూ ఉంది. కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలనుకుంటే ఆ నేతల్ని చేర్చుకుంటారు. కానీ వారి వల్ల ఎంత ఉపయోగం అనేది విశ్లేషించుకుంటే మాత్రం ఆగిపోతారన్న వాదన ఉంది. వారు కాంగ్రెస్ లోనే ఉంటేనే.. బీఆర్ఎస్కు మంచిదని.. వారిని పార్టీలో చేర్చుకుంటే అదనపు లగేజీ అన్న వాదనలు కూడా ఉన్నాయి.
పార్టీలో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నేతలు వదిలి వెళ్లిపోతే రేవంత్ రెడ్డి మరింత బలోపేతం అవుతారు. పార్టీపై ఆయన గ్రిప్ పెరుగుతుంది. ఆయనేది చెబితే అదే జరుగుతుంది. అటే పార్టీని రేవంత్ కు వదిలేసి సీనియర్లంతా వెళ్లిపోయినట్లవుతుంది… అది రేవంత్ కు మేలు చేయడమేనన్న విశ్లేషణ వినిపిస్తోంది.