శత్రువులు ఎక్కడో ఉండర్రా.. కూతుళ్ల రూపంలో మన పక్కనే తిరుగుతూ ఉంటారని ఓ సినిమాలో డైలాగ్ ను రైటర్ సర్కాస్టిక్ గా రాశారు.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మాత్రం నిజంగానే కూతురు శత్రువులా అయిపోయారు. ఆమె రాజకీయాల్లో లేరు. కానీ ఆయన చేసే తప్పుడు పనులకు కూతురు పేరు వాడుకోవడంతోనే సమస్య వచ్చింది సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేశారు. చేస్తే చేశారు.. దాన్ని బయటకు రాకుండా చూసుకోవాలి. కానీ ఆయన తన కుమార్తె పేరు మీద రిజిస్ట్రే,న్ చేయించుకున్నారు. అది కూడా కుమార్తెకు తెలియకుండా… ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.
దీంతో ఆమె తండ్రి వల్ల తాను కేసుల్లో ఇరుక్కుంటున్నానని ఆరోపిస్తూ… తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పోరాటం ప్రారంభించారు. తన తండ్రి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఆదివారం ప్రకటించారు. ఆస్పత్రికి రాసిస్తున్నట్లుగా బోర్డు కూడా పెట్టారు. ఎమ్మెల్యే కాకముందే తన తండ్రికి రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అలాంటి ఆయన ఈ పని చేయకుండా ఉండాల్సిందని అన్నారు. నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు.
అంతేకాక, క్షమాపణ కోరుతూ ఉన్నట్లుగా రాసిన ఒక బోర్డును కూడా ఆ స్థలంలో పాతించారు. తండ్రి ముత్తిరెడ్డిపై కేసు కూడా పెట్టారు . ఆయన తండ్రి ఎక్కడికి వెళ్తే తాను కూడా అక్కడకు వెళ్లి నిలదీస్తున్నారు. నాన్న ఎందుకీ పని చేశావంటున్నారు. కేసు పెట్టావు కదా తల్లీ.. అంతా చట్టమే చూసుకుంటుదని చెబుతూ.. ఎమ్మెల్యే తప్పించుకెళ్లిపోతున్నారు.