తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంటే.. అవసరం లేని స్నేహం చూపించుకుంటూ బీఆర్ఎస్, బీజేపీ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. తాజాగా మజ్లిస్ కూడా తాము బీఆర్ఎస్తో కలిసి లేమని చెబుతోంది. తెలంగాణలో తాము బలంగా ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైపీ నిజామాబాద్లో ప్రకటించారు. బోధన్ లో ఖచ్చితంగా పోటీ చేస్తామన్నారు.
బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి చేశారంటూ ఇటీవల కొంత మంది మజ్లిస్ నేతలపై కేసులు పెట్టి జైల్లో వేశారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన అసదుద్దీన్ బీఆర్ఎస్ పైనా మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ముందు మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము.. మా స్కోర్ మేము చూసుకుంటాం.. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంటే… ముందు సంఖ్యాబలం పెంచుకుంటే.. తర్వాత వచ్చే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చని మజ్లిస్ చీఫ్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
వచ్చే ఎన్నికలు తెలంగాణలో అత్యంత హోరాహోరీగా జరగబోతున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ పోటీలో తన ప్రభావం చూపాలని మజ్లిస్ చీఫ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ , కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ తాము తెలంగాణలో యాభై స్థానాల్లో పోటీ చేస్తామనిప్రకటించారు. ఇప్పుడు అసదుద్దీన్ కూడా అదే తరహాలో ప్రకటనలుచేస్తూండటం ఆసక్తికరంగా మారింది.