విశాఖలో శాంతిభద్రతలు సూపర్ గా ఉన్నాయని రౌడీలందర్నీ ఏరి పారేశామని డీజీపీ అమరావతిలో కూర్చుని ప్రకటించారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసినా దిక్కు లేదని విమర్శలు రావడంతోనే. అయితే డీజీపీ ఇచ్చిన భరోసా విశాఖలో ఎవరికీ పెద్దగా ధైర్యం ఇచ్చినట్లుగా లేదు. కాస్త డబ్బున్న వారంతా తమకు గన్ లైసెన్స్ ఇవ్వాలని పోలీసుల కుదరఖాస్తు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గన్ లైసెన్స్ ల కోసం ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నట్లుగా పోలీసు వర్గాలుచెబుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే.. తనకూ గన్ లైసెన్స్ కావాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ భద్రతలో ఉండే అమర్నాత్ ఇలా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువగా భద్రత ఉండే మంత్రుల్లో అమర్నాథ్ ఒకరు. ఆయనకు ఇది వరకే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. అయినా ఇంకా తనను తాను రక్షించుకోవడానికి అసాంఘిక శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించుకోవడానికి గన్ లైసెన్స్ అడిగినట్లుగా చెబుతున్నారు.
అయితే మంత్రిగా ఉన్నంత వరకే సెక్యూరి్టీ ఉంటుందని.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న ముందు చూపుతోనే అమర్నాథ్ గన్ లైసెన్స్ అడుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారితే గన్ లైసెన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరని..పైగా తమపై వేధింపులు ఎక్కువగా ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే గన్ లైసెన్స్ కోసం అమర్నాథ్ తొందరపడుతున్నారని అంటున్నారు. కారణం ఏదైనా విశాఖలో పరిణామాలు మాత్రం.. అక్కడి ప్రజల్ని నిద్రపట్టనీయడం లేదు.