కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభం కావడంతో ఆ పార్టీలో అగ్రనేతల మధ్య లుకలుకలు బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, బీఎస్ సంతోష్ మధ్య అనుకున్నంతగా పరిస్థితులు సామరస్యంగా లేవని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చాలని.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షా, బీఎల్ సంతోష్ రిపోర్ట్ రెడీ చేశారు. కొంత మంది బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చడంతో పాటు కొంత మంది మంత్రుల్ని తొలగించడం… మరికొందర్ని చేర్చుకోవడానికి సలహా ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ మాత్రం… ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ గురించి గత రెండు, మూడు నెలలుగా ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతీ సారి కేంద్రంలో మార్పులు చేర్పులు సహజంగానే జరుగుతున్నాయి. ఈ సారి కూడా అలా చేస్తారని అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ అమిత్ షా, బీఎల్ సంతోష్ ల వ్యహాలపై నమ్మకం కోల్పోయారని అంటున్నారు. వారు చెప్పిన ప్రతి విషయానికి అంగీకిరంచి.. ముఖ్యమంత్రుల్ని మార్చడం వల్ల.. కర్ణాటకలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని మోదీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
గతంలో అమిత్ షా చెప్పేదే వేదం. కానీ ప్రధాని మోదీ ఇప్పుడు కొన్ని అంశాల్లో అమిత్ షాతో విబేధిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీలో వేగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. బీజేపీ ఎదిగే అవకాశం వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడలో విఫలం కావడంతో మళ్లీ పడిపోయిన వ్యవహారం కూడా బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. పై స్థాయిలో నేతల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందని అందుకే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు.
ప్రధాని మోదీ … బీజేపీ ప్రధాన వ్యూహకర్తలు.. యాక్షన్ ప్లానర్లుగా ఉన్న అమిత్ షా,, బీఎల్ సంతోష్ లపై నమ్మకం కోల్పోతే… ఇక ఆయనే సొంత నిర్ణయాలు తీసుకుంటారు.అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి అదనపు సమస్యలు వస్తాయని అనుమానిస్తున్నారు.