బాహుబలి, పుష్ష, కేజీఎఫ్…. ఇవన్నీ రెండు భాగాలుగా వచ్చిన సినిమాలే. ఈ ఫార్ములా బాగా వర్కవుట్ అయ్యింది. ఆర్థికంగా అద్భుతమైన రిజల్ట్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు సలార్‌ని సైతం రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన ఉంది. ఈ జాబితాలో ప్రాజెక్ట్ కే కూడా చేరిపోయింది. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సైతం రెండు భాగాలుగా విడగొట్టి, విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తయ్యింది. 2024 జనవరిలో మొదటి భాగాన్ని విడుదల చేస్తారు.
ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1లో ముగింపులో.. కమల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌తోనే తొలి పార్ట్ కి ముగింపు పడుతుందని సమాచారం. పార్ట్ 2లో కమల్ పాత్ర పూర్తి స్థాయిలో కనిపిస్తుందట. కమల్ తో పాటు… కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన కొంతమంది అగ్ర నటులు సైతం పార్ట్ 2లో దర్శనమివ్వబోతున్నారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కె రెండో భాగాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తారు.