ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు రోజుల్లో ఆయనకు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ముప్పు ఉందని వై కేటగిరి భద్రత పెంచారు. ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ కు ఈ స్థాయి భద్రత పెంచడం మాత్రం అనూహ్య పరిణామమే.
కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు రాక ముందు ఈటల సతీమణి జమున ప్రెస్ మీట్ పెట్టారు. తన భర్తను చంపడానికి కౌశిక్ రెడ్డి రూ. ఇరవై కోట్ల సుపారీ ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఆయన చెప్పారన్నారు. అయితే కౌశిక్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తాను ఈటలను హత్య చేయించడానికి ప్లాన్ చేయలేదని.. హత్యారాజకీయాలు చేసేది ఈటలేనని మండిపడ్డారు. తర్వాత ఈటల కూడా ప్రెస్ మీట్ పెట్టి.. నయీంకే భయపడలేదు… ఈ సైకోకు భయపడతానా అని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.
ఆ తర్వాత కేంద్ర భద్రత ఇస్తారన్న సమాచారం బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సొంత పార్టీ నాయకులైనప్పటికీ ఊరకనే భద్రత కల్పించదు. బలమైన ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తుంది. దీంతో నిజంగానే ఈటల విషయంలో ఏమైనా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాల్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.