బీజేపీ , జనసేన మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. దీనికి టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధుల వ్యవహారం వేదిక అయింది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రూ. పది వేల విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ను రూ. ఐదు వందలకు ఇస్తున్నారు. ఆ పది వేల విరాళం ఎటుపోతోదంన్నదానిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ వైట్ పేపర్ పేరుతో అసలేమీ వివరాలు ప్రకటించలేదు. మరో వైపు.. ఇలా ప్రశ్నించడం దేవుడిపై నమ్మకాన్ని తగ్గించడమేనని బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నారు.
ఇలాంటి అనుమానాలు పెరుగుతున్న సమయంలో బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్పందిస్తూ శ్రీవాణి ట్రస్టులో విరాళాలు ప్రక్కదారి పట్టడం లేదని, టిటిడి విరాళలను హిందూ దేవాలయాల్లో ధూపధీప నైవేద్యాలు, నిర్మాణాలకే ఉపయోగిస్తుందంటూ, అనవసరంగా రాజకీయం చేయెద్దని వైసీపీ వాదనను వినిపించారు. దీనిపై బీజేపీలోనే ఆశ్చర్యం వ్యక్తం అయింది. ఆ అభిప్రాయం తనలో ఉంటే సైలెంట్ గా ఉండవచ్చు కానీ బహిరంగంగా చెప్పి.. బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న వాదనలకు మరింత బలం ఇవ్వడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలో ప్రారంభమయింది. వెంటనే జనసేన బీజేపీపీ ఎదురుదాడి ప్రారంభించింది.
శ్రీవాణి ట్రస్టును బిజేపినేత భానుప్రకాష్ రెడ్డి రాజకీయం చేయేద్దని చెప్పారని, ఇంతకీ భానుప్రకాష్ రెడ్డి బిజేపి నేతా, లేక అధికార పార్టి నేత అనేది తమకు అనుమానంగా ఉందని జనసేన నేత కిరణ్ రాయల్ ఎదురుదాడి చేశారు. . భానుప్రకాష్ రెడ్డి టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డికి అధికార ప్రతినిధి లాగా వ్యవహరిస్తున్నారని, శ్రీవాణి ట్రస్టుకు 1100 కోట్ల రూపాయలకు పైగా నిధులు వచ్చాయని బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అంటుంటే, టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మాత్రం ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పారని, మిగిలిన మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.. అసలు శ్రీవాణి ట్రస్టుపై అధికార పార్టికు చేందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేదని, దీనిపై బీజెపి నేత భానుప్రకాష్ రెడ్డికి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలియజేయాలన్నారు..
ఈ వ్యవహారం ఇంతటితో ఆగేలా లేదని.. బీజేపీ, జనసేన మధ్య మరింత రచ్చ జరగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.