మొదట ఓటుకి నోటు కేసు..ఆ తరువాత కాల్ మనీ వ్యవహారం..తరువాత ఇసుక మాఫియా ఇప్పుడు అమరావతి భూముల బినామీ కొనుగోళ్ళు…ఇలాగ ఏవో ఒక అవినీతి, అక్రమ వ్యవహారాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలు, ఆరోపణలకు ప్రభుత్వం సంజాయిషీలు చెప్పుకొంటూ వాటి నుండి బయటపడటానికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతోంది. ఇక పరిపాలన, అభివృద్ధి గురించి ఆలోచించడానికి దానికి సమయం ఎక్కడ మిగులుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టి కుదిపేస్తున్న మంత్రులు, అధికార పార్టీ నేతల అమరావతి భూముల బినామీ కొనుగోళ్ళపై తమ పార్టీ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై నిజానిజాలను వెలికిదీసి ప్రజల ముందు ఉంచేందుకు దానిపై సిబిఐ విచారణ కోరాలని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “అధికార పార్టీకి చెందిన నేతలు అమరావతిలో బినామీ పేర్లతో వేల ఎకరాల భూములను కొనుగోలు చేసారని సాక్షి పత్రిక ఆధారాలతో సహా చూపిస్తుంటే వారు సిగ్గుతో తల దించుకోవడం మాని ఎదురుదాడి చేస్తూ తమ బండారం బయటపెట్టినందుకు సాక్షిని కోర్టుకి ఈడుస్తామని బెదిరిస్తున్నారు. ఈవిధంగా తెదేపా ప్రభుత్వం అవినీతి, అక్రమ మార్గాలలో పోగేసిన డబ్బుతో మా ఎమ్మెల్యేలు ఒక్కొకరికీ రూ.20కోట్లు ఆఫర్ చేస్తూ పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహిస్తోంది. సాక్షి మీడియా వద్ద అధికార పార్టీ నేతల బినామీ భూముల కొనుగోళ్లకు సంబంధించి అన్ని సాక్షాదారాలున్నాయి. కనుక తక్షణమే దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.
అందరి కంటే ఎక్కువ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి నారాయణ తను ప్రజాసేవ చేయడానికే తన వ్యాపారాలను అన్నిటినీ వదులుకొని రాజకీయాలలోకి వచ్చెనని చెప్పుకొంటున్నారు. మిగిలిన తెదేపా మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తాము అమరావతిలో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని గట్టిగా వాదిస్తున్నారు. తమ, తమ ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బ తీయడానికే చేతిలో ఉన్న సాక్షి మీడియాను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందుకు సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రెండు పార్టీలకు ప్రతిష్టకి సంబంధించిన వ్యవహారంగా మారింది కనుక వైకాపా విసురుతున్న ఈ సవాలుని తెదేపా ప్రభుత్వం స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే బాగుంటుంది. లేదా కనీసం వైకాపా చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలకు న్యాయస్థానంలో ధీటుగా సమాధానం చెపితే తమ నిజాయితీని నిరూపించుకోవచ్చును కదా?