మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తూండటం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు. తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ పాత్ర చాలా కీలకం. ఆ పార్టీకి కనీసం ఏడు స్థానాలు గ్యారంటీగా వస్తాయి. అంతే కాదు ఆ పార్టీ తాను అనుకున్న పార్టీకి ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించగలదు. కానీ ఇప్పుడు అసదుద్దీన్.. తమ బలం ఏంటో చూపిస్తామని అంటున్నారు. ఇంత కాలం పాతబస్తీ తప్ప బయట పోటీ చేసేది కాదు. బీఆర్ఎస్కు మద్దతు పలికేది . కానీ ఇప్పుడు తాము బలంగా ఉన్న చోట్ల అంటే… ముస్లింలు ఎక్కువగా ఉన్న అన్ని చోట్లా పోటీ చేస్తామని చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణలో మజ్లిస్ ప్రభావం కాస్త గట్టిగానే ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువ. అందుకే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు హిందువులకు టిక్కెట్లు ఇచ్చి .. ప్రయోగాలు చేస్తూంటారు అసదుదదీన్. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లోనూ అలాగే తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న మజ్లిస్… మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధయింది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్,బోధన్, నిజామాబాద్ లాంటి చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంది.
మజ్లిస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయన పోటీ చేస్తున్నారు. ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఆయన పట్టు పెంచుకోవాలని చూడకుండా ఉండరు. రాజకీయాల్లో ఎవరికైనా అంతిమ లక్ష్యం తాము బలపడటమే. పరస్పర ప్రయోజనాలు ఉన్నప్పుడే.. సహకారం తీసుకుంటారు. ఒక పార్టీకే ప్రయోజనం కల్పించే సహకారాలు రాజకీయాల్లో నిలబడవు. అందుకే పరస్పర ప్రయోజనం ఉంటేనే మజ్లిస్ సహకారానికి ఒప్పుకుంటుంది. అందుకే.. ముందు ముందు బీఆర్ఎస్కు క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.